డీకే మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యండి కోర్టు ఆర్డర్, చిక్కుల్లో డీసీఎం, ఆఫోటోలతో ఏం చేశారంటే ?
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ట్రబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులో సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునే కేసులో సీబీఐ మళ్లీ కోర్టులో అప్పీల్ దాఖలు చేయడంతో కేపీసీసీ అధ్యక్షుడు కూడా అయిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మరో సమస్య వచ్చింది.
అయితే బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీవై. విజయేంద్ర సహా బీజేపీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేశారనే ఆరోపణలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా బెంగళూరు నగరంలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు హైగ్రౌండ్ స్టేషన్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఇప్పుడు మళ్లీ చిక్కుల్లో పడ్డారు.

బీజేపీ లీగల్ సెల్ కమిటీ కన్వీనర్ యోగేంద్ర దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును విచారించిన బెంగళూరు సిటీలోని 42వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ కర్ణాటక సామాజిక విభాగం (సోషల్ మీడియా) చీఫ్ బీఆర్, నాయుడుపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేసి పూర్తి సమాచారంతో నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రత్యేక కోర్టు ఈ కేసు విచారణను మార్చి 30వ తేదీకి వాయిదా వేసింది.
2024 జనవరి మొదటి వారంలో 31 ఏళ్ల క్రితం నాటి పాత కేసుకు సంబంధించి 60 ఏళ్ల హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారిని కర్ణాటకలోని హుబ్బళి పోలీసులు అరెస్టు చేశారు. 31 ఏళ్ల క్రితం నాటి కేసులో హిందూ కార్యకర్తను అరెస్టు చెయ్యడాన్ని ఖండిస్తూ కర్ణాటక బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై. విజయేంద్ర, మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప, మాజీ మంత్రులు సునీల్ కుమార్, కే. ఎస్. ఈశ్వరప్ప, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా, మాజీ మంత్రి సి. టి. రవితో పాటు పలువురు నాయకులు ధర్నాలు చేశారు.

మమ్మల్ని అరెస్టు చెయ్యండి అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అదే ఫోటోలను మార్ఫింగ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా వివిధ వర్గాల పౌరుల మధ్య విద్వేషాన్ని పెంచిందని, దాంతో బీజేపీ నేతలపై విద్వేషాలు రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. అంతేకాకుండా నిరాధార ఆరోపణలు చేశారని బీజేపీ లీగల్ సెల్ నాయకులు ఫిర్యాదులో వివరించారు.
ఈ పోస్ట్‌లను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది మంది వీక్షించారని, ఇలాంటి చర్యలను కొనసాగిస్తే మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడతారని, కావున నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ లీగల్ సెల్ కమిటీ కన్వీనర్ యోగేంద్ర ఫిర్యాదులో కోరారు. ఈ పిటిషన్ విచారణ చేసిన కోర్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చెయ్యాలని బెంగళూరులోని హైగ్రౌండ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications