ఇంటర్ పరీక్షల్లో జై శ్రీరామ్ అని రాసినందుకు ఫస్ట్ క్లాస్‌లో పాస్ చేశారు
Uttar Pradesh University: ఉత్తరప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. యాన్సర్ షీట్‌లో జై శ్రీరామ్ అని రాసినందుకు కొందరు విద్యార్థులను ఫస్ట్ క్లాస్‌లో పాస్ చేశారు అక్కడి ప్రొఫెసర్లు. కొందరు క్రికెటర్ల పేర్లనూ జవాబు పత్రంలో రాశారా విద్యార్థులు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. స్పాట్ వేల్యుయేషన్‌లో ఆ విద్యార్థులకు మార్కులు వేసిన ఇద్దరు ప్రొఫెసర్లపై చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేశారు.

ఉత్తర ప్రదేశ్ జౌన్‌పూర్‌లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ నిర్వహించే ప్లస్ 2 పరీక్షల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ప్లస్ 2 పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షల్లో కొందరు విద్యార్థులు జవాబు పత్రాల్లో జై శ్రీరామ్ ముఝే పాస్ కరో అంటూ రాసుకొచ్చారు. అలాగే హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి కొందరు క్రికెటర్ల పేర్లను కూడా జవాబు పత్రాల్లో రాశారు.
ఆ విద్యార్థులందరూ కూడా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. పాస్ అవ్వడం కష్టమని భావించే ఆ విద్యార్థులు 60 శాతం మార్కులతో పాస్ కావడం పట్ల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ దివ్యాన్షు సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్, వైస్ ఛానల్సర్‌కు లేఖలు రాశారు. రీవాల్యుయేషన్ చేపట్టాలని కోరారు.
దీనితో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ వందనా సింగ్ ధృవీకరించారు. ఆ విద్యార్థులకు రావాల్సిన మార్కుల కంటే ఎక్కువ వచ్చాయని అన్నారు. దీనికి కారణమైన ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications