‘ఠాగూర్’లోలా యువకుడి మృతదేహానికి వైద్యం చేశారు!
చెన్నై: టాలీవుడ్ మెగాస్టార్ నటించిన 'ఠాగూర్' చిత్రంలో ఓ శవానికి వైద్యం చేసి భారీ మొత్తం డబ్బు గుంజేందుకు ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం చేసిన హంగామా సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులోని తిరుప్పూరులో తాజాగా చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తిరుప్పూరు కన్నగినగర్‌కు చెందిన రాసుకుట్టి (21) తన ప్రేమ విఫలం కావడంతో శనివారం రాత్రి విషం తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రాసుకుట్టిని తండ్రి మారిముత్తు, కుటుంబీకులు వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళుతుండగా అతడి దేహం పూర్తిగా చల్లబడిపోయింది. ఊపిరికూడా ఆగిపోయింది. దీంతో రాసుకుట్టి మరణించాడని నిర్ధారణకు వచ్చారు.
ఆలోపే ఆస్పత్రికి చేరుకున్నారు. వాహనం నుంచి రాసుకుట్టిని దింపగానే వెంటనే ఆస్పత్రి సిబ్బంది పరుగున వచ్చి స్ట్రెచర్‌పై వేసుకుని లోపలికి తీసుకెళ్లారు. ఆ ఆస్పత్రి డాక్టర్లు రాసుకుట్టిని పరిశీలించి అతడు చనిపోయాడని ధృవీకరించి తిరిగి అప్పగిస్తారని తండ్రి మారిముత్తు, కుటుంబీకులు ఎదురుచూశారు. అయితే వారు ఊహించనివిధంగా రాసుకుట్టి ప్రాణాలతోనే ఉన్నాడని, అతడికి అత్యవసర చికిత్సలందించాల్సి ఉందని వైద్యులు చెప్పారు.

అంతేగాక, వెంటనే రూ.15 వేలు చెల్లించాలంటూ ఆస్పత్రి సిబ్బంది హడావుడి చేశారు. దీంతో రాసుకుట్టి బంధువులు ఇంటికి వెళ్లి రూ.15 వేలను తీసుకొచ్చి ఆ ఆస్పత్రిలో కట్టారు. ఆ డబ్బులు ఆస్పత్రి ఖాతాలో జమ అయిన పావుగంటకల్లా డాక్టర్లు.. రాసుకుట్టి తండ్రి, బంధువుల వద్దకు వచ్చి సారీ తామెంతగానో ప్రయ త్నించినా అతడిని కాపాడలేకపోయామని దిగాలుగా చెప్పి లోపలికి వెళ్లిపోయారు.
ఈ పరిణామంతో రాసుకుట్టి బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమకు అవాస్తవాలు చెప్పి తమ వద్ద నుంచి డబ్బు గుంజారంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు రాసుకుట్టి బంధువులు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.
ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు డబ్బే ప్రధానమని రుజువు చేసే సంఘటన మరోటి జరిగిందని పలువురు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications