పల్టీ కొట్టిన బెంగళూరు టూరిస్ట్ బస్సు
కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పర్యాటకుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 40 మందికి పైగా పర్యాటకులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ తెల్లవారు జామున చిక్ మగళూరు జిల్లాలో ఈ దుర్ఘటన సంభవించింది. వీకెండ్ కావడంతో బెంగళూరులో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తోన్న 40 మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఓ టూరిస్ట్ బస్సును అద్దెకు తీసుకుని శుక్రవారం రాత్రి చిక్ మగళూరుకు బయలుదేరారు.

కుద్రేముఖ్ పర్వత శ్రేణుల్లో గల నేత్రావతి పీక్ సహా వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనేది వారి ప్లాన్. బెంగళూరు నుంచి బయలుదేరిన నంబర్ ఎన్ ఎల్ 01 బీ 3129 బస్సు.. మార్గమధ్యలో తెల్లవారు జామున ముడిగెరె తాలూకా పరిధిలోని దేవనగుళ్ గ్రామం సమీపానికి చేరుకున్న తరువాత ప్రమాదానికి గురైంది. రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా కొట్టింది.
ఈ ఘటనలో బస్సులో ఉన్న పర్యాటకుల్లో 25 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చిక్ మగళూరు, ముడిగెరె ఆసుపత్రులకు తరలించారు.
కొంతకాలంగా కర్ణాటక కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. పశ్చిమ కనుమలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఎటు చూసిన జలపాతాలు కనువిందు చేస్తోన్నాయి. వాటిని తిలకించడానికి వీకెండ్ లల్లో పెద్ద ఎత్తున పర్యాటకులు ఆయా హిల్ స్టేషన్లకు చేరుకుంటోన్నారు. నేత్రావతి, దేవరమనె, కుమార పర్వత.. వంటి పర్వతశ్రేణులను అధిరోహిస్తూ పకృతి అందాలను ఆస్వాదిస్తోన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరు ఎంఎన్సీకి చెందిన ఉద్యోగులు నేత్రావతిని సందర్శించడానికి వచ్చారు. భారీ వర్షాల వల్ల పలు చోట్ల రోడ్డు ధ్వంసం కావడం, మలుపులు ప్రమాదకరంగా మారడం వల్ల పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తోన్నారు. ట్రెక్కింగ్ చేసే సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications