ఆంధ్రా యువకులు టార్గెట్, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు, పవన్ పక్కాప్లాన్ తో రూ. కోట్లు !
సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కోట్లాది రూపాయలను మోసం చేసిన ఓ నిందితుడిని మోసపోయిన నిరుద్యోగులు పట్టుకుని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన కేవీ పవన్ కుమార్ అలియాస్ పవన్ అనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
దాదాపు 24 మంది నిరుద్యోగులు పవన్ మీద బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఢిల్లీకి పారిపోయిన పవన్ అక్కడే దాక్కొన్నాడు. తరువాత మాకు ఉద్యోగం కావాలని, డబ్బులు ఇస్తామని కొందరు నిరుద్యోగులు వేరే కొత్త మొబైల్ నంబర్ నుంచి పవన్ కు ఫోన్ చేశారు. అయితే అసలు మ్యాటర్ పవన్ పసిగట్టలేకపోయాడు.

ఉద్యోగం కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులు పవన్ ను నమ్మించి బెంగళూరుకు పిలిపించి అతన్ని పట్టుకున్నారు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన పవన్ బెంగళూరు నగరానికి చేరుకుని తర్వాత సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వైట్‌ఫీల్డ్ టెక్‌పార్క్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో రెండు చీటింగ్ కంపెనీలను ప్రారంభించాడు. ఆ కంపెనీల్లో రిక్రూట్‌మెంట్ పేరుతో నిరుద్యోగులకు వలవేశాడు.
తరువాత నిరుద్యోగులు ఫీజు చెల్లించి రిక్రూట్‌మెంట్ కోసం వారి పేర్లు నమోదు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యావంతులు, బెంగళూరులో ఉపాధి కోసం వచ్చిన సుమారు 500 మందికి పైగా యువతి, యువకులను మోసం చేసిన పవన్ వారి నుంచికోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు తమకు సమాచారం అందిందని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

ఉద్యోగం వెతుక్కుంటూ బెంగుళూరు వచ్చే ఆంధ్రప్రదేశ్ కు చెందిన నిరుద్యోగులనే పవన్ టార్గెట్ చేసుకున్నాడని. నిందితుడు పవన్ ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని మోసం చేశాడని, ఇలా సుమారు రూ 20 కోట్లకు పైగా పవన్ వసూలు చేశాడని బెంగళూరు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ను అరెస్టు చేసి అతను ఇంకా ఎంతమందిని మోసం చేశాడు అని దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications