కులం పేరుతో సీనియర్ల టార్చర్: మహిళా మెడికో ఆత్మహత్య, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు !
ముంబై: సాటి విద్యార్థులు కులం పేరుతో వేధింపులకు గురి చెయ్యడంతో జీవితంపై విరక్తి చెందిన మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని బీవైఎల్ నాయర్ మెడికల్ కాలేజ్ లో పీజీ విద్యాభ్యాసం చేస్తున్న పాయల్ సల్మాన్ తాద్వీ (23) అనే యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
బీవైఎల్ నాయర్ మెడికల్ కాలేజ్ లో హాస్టల్ ఉంటూ పాయల్ పీజీ విద్యాభ్యాసం చేస్తున్నది. పాయల్ ను సాటి సీనియర్లు నిత్యం కులం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాటి సీనియర్లు వేధింపులు ఎక్కువ కావడంతో సూసైడ్ నోట్ రాసి పెట్టిన పాయల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

విషయం తెలుసుకున్న సాటి విద్యార్థులు కాలేజ్ యాజమాన్యంకు సమాచారం ఇచ్చారు. కాలేజ్ లో సీనియర్లు హేమా అహూజా, భక్తి మేహర్, అంకితా కండిల్ వాలాలు వేధింపులకు గురి చెయ్యడంతో పాయల్ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాయల్ ఫిర్యాదు చెయ్యడంతో ముగ్గురు సీనియర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జూనియర్ విద్యార్థిని పాయల్ ఆత్మహత్యకు కారణం అయిన ముగ్గురు మెడికో విద్యార్థులను విధుల నుంచి తప్పించి వారిని అనర్హులను చేశామని మహారాష్ట్ర వైద్యుల సంఘం ప్రకటించింది.
అయితే తమ మీద వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ముగ్గురు విద్యార్థులు మహారాష్ట్ర వైద్యుల సంఘానికి లేఖ రాశారు. గతంలో కులం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని పాయల్ తమకు సమాచారం ఇచ్చిందని, కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని ఆమె తల్లి ఆరోపించారు. పాయల్ ను వేధింపులకు గురి చేస్తున్నారని తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని కాలేజ్ యాజమాన్యం అంటోంది.












Click it and Unblock the Notifications