దారుణం: కోరిక తీర్చలేదని ప్రియురాలి హత్య
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తన కోరిక తీర్చలేదని ఆగ్రహానికి గురైన ఓ యువకుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లాలోని పూండి యూనియన్ పరిధిలోని నైవేలి గ్రామానికి చెందిన కుప్పన్ కుమార్తె చాముండేశ్వరి(19), అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. అయితే చాముండేశ్వరి మనవాలనగర్ ప్రాంతానికి చెందిన మరో యువకుడితో ప్రేమలో పడి రాజ్‌కుమార్‌ను దూరంగా ఉంచింది.

ఈ నేపథ్యంలో చాముండేశ్వరిపై కోపం పెంచుకున్న రాజ్ కుమార్.. చివరిసారిగా ఒకసారి మాట్లాడాలని ఆమెను కోరాడు. దీంతో తన ఇంటి సమీపంలోకి వచ్చిన రాజ్ కుమార్‌ను ఆ యువతి కలిసింది. తన కోరికను తీర్చాలని నిందితుడు ఆమెను బలవంత పెట్టాడు. అందుకు అంగీకరించకపోవడంతో చాముండేశ్వరి తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు రాజ్‌కుమార్. ఈ విషయాలన్నింటినీ పోలీసుల విచారణలో నిందితుడు రాజ్‌కుమార్ వెల్లడించాడు.
మృతురాలు మనవాలనగర్‌లోని లోకిదాస్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోందని పోలీసులు చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితుడు రాజ్‌కుమార్‌ను ఉత్తుకోట వద్ద అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications