స్మృతీ ఇరానీని ఇబ్బంది పెట్టిన జర్నలిస్ట్ ప్రశ్న: విమర్శలు(వీడియో)
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీతో చర్చా కార్యక్రమంలో ఓ ఛానల్ జర్నలిస్ట్ తన వివాదాస్పద ప్రశ్నతో ఆమెను ఇబ్బందికి గురిచేశారు. ఆమెను ఆ విధమైన ప్రశ్న వేసిన సదరు జర్నలిస్టుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆజ్ తక్ ఛానల్ ‘స్మృతీ కీ పరీక్షా' పేరిట ఓ కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి స్మృతీ ఇరానీని ఛానల్ పొలిటికల్ ఎడిటర్ అశోక్ సింఘాల్ ఓ వివాదాస్పద ప్రశ్న అడిగారు.
వయసులో చిన్నవారైనా, మానవ వనరుల శాఖ దక్కించుకున్నారని, ఆయన(ప్రధాని నరేంద్ర మోడీ) మీలో ఏం చూసి పదవి ఇచ్చారని ప్రశ్నించారు. దీంతో స్మృతీ ఇరానీ దిగ్ర్భాంతికి గురయ్యారు. వెంటనే తేరుకుని, మహిళలు ఈ ప్రశ్నను మరోసారి వినాలని రిపీట్ చేయించారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రేక్షకులు.. సింఘాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తన ప్రశ్న వివాదాస్పదమవుతోందని గ్రహించిన అశోక్ సింఘాల్ స్పందిస్తూ.. మంత్రి విద్యార్హతలకు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే తాను ఈ ప్రశ్న అడిగినట్లు వివరణ ఇచ్చారు. ఆమె విద్యార్హతలు ప్రశ్నార్థకమైన నేపథ్యంలో మంత్రి పదవి ఎలా లభించిందన్నదే తన ప్రశ్న వెనకున్న ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఒక మహిళా మంత్రిని పట్టుకుని అలాంటి ద్వంద్వార్థపు ప్రశ్న వేసిన జర్నలిస్ట్ అశోక్ సింఘాల్‌పై అటు భారతీయ జనతా పార్టీ శ్రేణులతోపాటు సామాజిక మాధ్యమంలో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications