పంజాబ్‌లో గెలుపు కోసం ఆప్ కొత్త అస్త్రం.. ప్రచారంలోకి కేజ్రీవాల్ భార్య, కుమార్తె
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో దుమ్మురేపుతున్నాయి. పోలింగ్‌కు మరో నాలుగు రోజులే సమయం ఉండడంతో మరింత దూకుడుతో ముందుకు వెళ్తున్నాయి.
పంజాబ్‌లో పాగాకు కేజ్రీవాల్ కొత్త అస్త్రం
పంజాబ్‌లో ఈసారి ఎలాగైనా పాగా వేసేందుకు ఆమ్ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్ష బీజేపీని దెబ్బ కొట్టేందుకు తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచార పర్వంలోకి తన కుటుంబ సభ్యులను రంగంలోకి దింపుతున్నారు. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 11న సంగ్రూర్ జిల్లా ధూరిలో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్‌కి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.

ప్రచారంలో కేజ్రీవాల్ భార్య, కుమార్తె
ధూరిలో ఆప్ నిర్వహించే జన్ సభకు భగవంత్ మాన్ తల్లి, సోదరితో పాటు కేజ్రీవాల్ కుమార్తె కూడా హాజరుకానున్నారు. పంజాబ్‌లో తన ఎన్నికల ప్రచారం గురించి స్వయంగా సునీతా కేజ్రీవాల్ ఈవిషయాన్ని తెలియజేశారు. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 14న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మరోవైపు పంజాబ్‌లో మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ సర్వశక్తుల ఒడ్డుతుంది. కాంగ్రెస్ సర్కార్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి రావాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications