హీరోయిన్ ను చేస్తామని మాజీ సీఎం కూతురికి టోకరా.. రూ. 4 కోట్లతో జంప్..!
కేటుగాళ్ల వలలో పడి సాధారణ ప్రజలు మోసపోవడం రోజూ చూస్తుంటాం. కానీ వీళ్ల మాయలో పడి ఓ మాజీ సీఎం కూతురే మోసపోయింది. సినిమాల్లో హీరోయిన్ చేస్తామని మాయమాటలు చెప్పి ఏకంగా మాజీ సీఎం కూతురునే నమ్మించారు కేటుగాళ్లు. వాళ్ల మోసపూరిత మాటలను నమ్మి రూ. 4కోట్లు కూడా ఇచ్చింది. అంతే ఆ డబ్బుతో జంప్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది.
ఉత్తరాఖండ్ మాజీ సీఎం రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ కూతురే ఆరుషీ నిషాంక్. తాము బాలీవుడ్ నిర్మాతలమని ఇద్దరు వ్యక్తులు ఆరుషీ వద్దకు వచ్చారు. సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తామని మాయమాటలు చెప్పారు. వారి మాటలను ఆమె నిజంగానే నమ్మేసింది. అలానే మోసపూరిత మాటలతో ఆమె నుంచి రూ. 4కోట్లు లాగేశారు. ఇప్పుడు ఆమెను కాదని వేరే యువతికి అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె డెహ్రాడున్ లోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు.

ఏం జరిగింది..?
ఆరుషీ ప్రస్తుతం హిమశ్రీ ఫిల్మ్స్ అనే బ్యానర్ కు కో- ఓనర్ గా వ్యవహరిస్తోంది. అయితే ఆమె వద్దకు మాన్సీ వరుణ్ బాంగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాంగ్లా అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తాము మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో నిర్మాతలమని చెప్పారు. తాము ఆకోన్ కీ గుస్తాకియాన్ అనే హిందీ మూవీని నిర్మిస్తున్నాం. అందులో షయనా కపుర్, విక్రాంత్ మాస్సీ లీడ్ రోల్లో చేస్తున్నారు. మిమ్నల్ని కూడా ఆ సినిమాలో హీరోయిన్ ను చేస్తాం.
అని నమ్మించి రూ. 4 కోట్లు తీసుకున్నారు. త్వరలో షూటింగ్ ఉంటుందని నమ్మించారు. ఆ తర్వాత ఒక రోజు ఆరుషీకు కేటుగాళ్లు మెసేజ్ పెట్టారు. 'మీరు నటించాల్సిన సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ యూరప్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మీకు బదులుగా వేరొకరిని ఎంపిక చేశారు' అని అందులో ఉంది. దీంతో ఆరుషీ ఒక్కసారిగా షాక్ తిన్నది. తాను మోసపోయానని భావించింది.
తన డబ్బులను తిరిగి ఇవ్వాలంటూ వారిద్దరిని ఆరుషీ నిలదీసింది. వాళ్లు బెదిరింపులకు దిగారు. డబ్బులు అడిగితే హత్య చేయిస్తామని బెదిరించారు. దీంతో ఆరుషీ డెహ్రాడున్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపే కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications