corona: మోడీ ప్రభుత్వం ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ విధించనుందా?: నిజమెంత?
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అనేక తప్పుడు ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, కరోనా నేపథ్యంలో దేశంలో ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థితి)ని విధిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
నిజం లేదంటూ ఇండియన్ ఆర్మీ..
అంతేగాక, ఎమర్జెన్సీ నేపథ్యంలో మాజీ భారత సైనికులు, ఎన్‌సీసీ, ఎన్ఎస్‌సీ క్యాడెట్లు పౌర పరిపాలకులుగా కొనసాగుతారని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలో ఎంత మాత్రం కూడా వాస్తవం లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. ఏడీజీ పీఐ-ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ వేదికగా ఈ తప్పుడు కథనాలపై స్పందించింది. ఎమర్జెన్సీ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇదంతా దురుద్దేశ, విద్వేషపూరితంగా ఉందని తెలిపింది. ఎమర్జెన్సీ అంటూ వచ్చిన అన్ని వార్తల్లోనూ ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ఆర్థిక అత్యవసర పరిస్థితంటూ మరో ప్రచారం..
దేశంలో కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సందేశాలు, తప్పుడు ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అంతకుముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై కూడా కేంద్రం స్పందించింది. ప్రభుత్వానికి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

లాక్‌డౌన్ పొడగింపుపై తప్పుడు ప్రచారం..
ఇక కరోనా కట్టడి కోసం మూడు వారాలపాటు లాక్ డౌన్ పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే, లాక్ డౌన్ పొడగించే విషయంపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
Recommended Video

కరోనా స్టేజ్ 3లోకి భారత్ అంటూ..
కొవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌కి మనదేశం చేరుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అదంతా తప్పుడు ప్రచారమేనని తెలిపింది. ఇంకా మనదేశం లోకల్ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌లోనే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒకవేళ దేశం కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌కి వెళితే కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటిస్తుందని, తప్పుడు వార్తలను, ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేసింది. కరోనావైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌కి భారత్ చేరుకుంటుందంటూ ప్రచారం జరుగుతుండటంతో కేంద్రం ఈ విషయంపై రెండోసారి స్పష్టతనిచ్చింది. కాగా, దేశ వ్యాప్తంగా 1071 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications