వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పండర్‌పుర్ వారీ: ‘పీరియడ్స్ అనేవి పాండురంగడు ఇచ్చినవే. అవన్నీ ఆయనకే చెందుతాయి’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పండర్‌పుర్ వారీలో పాల్గొన్న వర్కారీ మహిళ

పీరియడ్స్ సమయంలో మహిళలు దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేయడమనేది చాలా సమాజాల్లో నిషేధం. తెలుగు రాష్ట్రాల్లోనూ పండగలు, పూజల సమయంలో పీరియడ్స్ రాకుండా మహిళలు మాత్రలు వేసుకోవడమనేది సాధారణంగా కనిపిస్తుంది.

ఇక పీరియడ్స్ కారణంగానే శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశం ఎంతో కాలంగా వివాదంగా మారుతూ వస్తోంది.

ఇలా దేశంలోని భిన్న సమాజాలు, మతాలు, కులాలల్లో రుతుస్రావం చుట్టూ అనేక వాదాలు వివాదాలున్నాయి.

కానీ మహారాష్ట్రలో 21 రోజుల పాటు జరిగే పండర్‌పుర్ వారీ భక్తి యాత్ర ఇందుకు భిన్నం. పీరియడ్స్‌లో ఉన్న మహిళలు కూడా ఈ యాత్రలో పాల్గొంటారు.

పండర్‌పుర్ వారీ

పండర్‌పుర్ వారీ అంటే?

పండర్‌పుర్ వారీ లేదా పండర్‌పుర్ యాత్ర అనేది వర్కారీ భక్తి సంప్రదాయంలో ముఖ్యమైనది. వర్కారీ అనేది హిందూ మతంలోని ఒక భక్తి ఉద్యమం. సుమారు 13వ శతాబ్దంలో మొదలైన ఈ భక్తి ఉద్యమం సమాజంలోని అసమానతలను వ్యతిరేకించింది. కుల వివక్షను తప్పుపట్టంది. మహారాష్ట్ర, ఉత్తర కర్నాటకలో వర్కారీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

సంత్ ధ్యానేశ్వర్, సంత్ తుకారమ్‌ల పాదుకలను పల్లకిలో పెట్టుకుని ఊరేగింపుగా పండర్‌పుర్‌లోని పాండురంగ దేవాయానికి తీసుకెళ్లే యాత్రనే పండర్‌పుర్ వారీ అంటారు. మహారాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. 21 రోజులపాటు ఈ యాత్ర జరుగుతుంది.

ప్రతి ఏడాది చైత్రం(మార్చి-ఏప్రిల్), ఆషాఢం(జూన్-జులై), కార్తీకం(అక్టోబర్-నవంబర్), మాఘ(జనవరి-ఫిబ్రవరి) మాసాల్లో పండర్‌పుర్ యాత్ర జరుగుతుంది.

పండర్‌పుర్ వారీ

చెడు ఇంట్లోనే అక్కడ కాదు

పీరియడ్స్‌ వచ్చినప్పుడు అది ముట్టుకోకు ఇది ముట్టుకోకు అంటూ మహిళలను ఇళ్లలో దూరం పెడుతుంటారు. కొన్ని సమాజాల్లో అయితే ఇంటి బయట లేదా ప్రత్యేకంగా నిర్మించిన గుడిసెల్లో మహిళలు ఉండాల్సి వస్తుంది. కానీ పండర్‌పుర్ యాత్రలో మాత్రం పీరియడ్స్‌లో ఉన్న మహిళల మీద ఎటువంటి ఆంక్షలు ఉండవు. రుతుస్రావం అనేది ప్రకృతిలో భాగమే కదా అని ప్రశ్నిస్తారు వర్కారీ మహిళలు. మహారాష్ట్రలో వర్కారీ భక్తి సంప్రదాయం వందల సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ భక్తి సంప్రదాయంలో మహిళా సంత్‌లు కూడా ఉన్నారు.

పండర్‌పుర్ వారీలో పాల్గొన్న వర్కారీ మహిళలు

భక్తి యాత్రలో పీరియడ్స్ వస్తే ఎలా?

సోలార్‌పుర్ జిల్లాలోని అక్లుజ్ వద్ద కొందరు వర్కారీలు సంత్ తుకారాం పల్లకిని మోస్తున్నారు. మరికొందరు మూటలు, సంచులు భుజాన వేసుకుని వడివడిగా నడుస్తున్నారు. గుంపులు గుంపులుగా వర్కారీలు కనిపిస్తున్నారు. ఒక నీళ్ల ట్యాంక్ వద్ద వర్కారీ మహిళలు బట్టలు ఉతుక్కుంటున్నారు.

అన్ని రకాల పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగుతామని వర్కారీలు చెబుతుంటారు. కానీ మగవాళ్లతో పోల్చినప్పుడు మహిళా వర్కారీలకు ఈ యాత్ర చేయడం అంత సులభం కాదు. వారు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రధానంగా పీరియడ్స్ వచ్చినప్పుడు అది మరింత కష్టంగా ఉంటుంది.

స్నానం ఎలా చేయాలి? శానిటరీ ప్యాడ్స్ ఎక్కడ మార్చుకోవాలి? యాత్రలో ఉన్న మహిళలు రుతుస్రావం సమయంలో శుభ్రత పాటించడం సాధ్యమేనా? దేవుని యాత్రలో పీరియడ్స్‌లో ఉన్న మహిళలు పాల్గొనడాన్ని ఇక్కడ ఎలా చూస్తారు? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తుంటాయి.

పూణె జిల్లాకు చెందిన జయమాల, దేహూ నుంచి సంత్ తుకారం పల్లకి సేవలో పాల్గొన్నారు. యాత్రలో ఉన్నప్పుడు తనకు పీరియడ్స్ రావడంపై ఆమె మాట్లాడారు.

'పీరియడ్స్ వచ్చినప్పుడు శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తాం. గుడ్డలో లేదా పేపర్లలో వాటిని చుట్టి పెడతాం. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు నడవడం అనేది మాకేమీ కష్టంగా అనిపించదు. పండర్‌పుర్‌కు వెళ్లడంలో మాకు ఎనలేని ఆనందం కలుగుతుంది' అని జయమాల చెప్పుకొచ్చారు.

పీరియడ్స్ సమయంలో మహిళలను ఇళ్లలో కొందరు దూరంగా పెడతారు. మరి పండర్‌పుర్ వారీలో పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు...

'ప్రతి ఒక్కటీ పాండురంగని పాదాలలోనే ఉంటుంది. ఇక్కడ రుతుస్రావాన్ని దోషంగా చూడరు. చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం ఇలానే కొనసాగుతూ వస్తోంది. ఇళ్లలో రుతుస్రావం వచ్చినప్పుడు దూరంగా పెడతారు. కానీ ఇక్కడ అలా కాదు. వారు కూడా పాండురంగని అడుగుజాడల్లో నడుస్తారు. కాబట్టి పీరియడ్స్‌ను చెడుగా చూడరు' అని జయమాల అన్నారు.

పండర్‌పుర్ వారీలో పాల్గొన్న వర్కారీ మహిళలు

'పీరియడ్స్ దేవుడు ఇచ్చినవే కదా?'

యవత్మాల్ జిల్లా నుంచి పండర్‌పుర్ వారీల పాల్గొన్న 50 ఏళ్ల శోభతాయి... పీరియడ్స్ వచ్చినప్పుడు పూజలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని అంటున్నారు. కానీ ఆమె అభిప్రాయంతో అర్చన కదం అంగీకరించడం లేదు.

'రుతుస్రావం అనేది ప్రకృతి సహజం. అలాంటప్పుడు ఆ ప్రకృతే ఇచ్చిన పీరియడ్స్ అపవిత్రం ఎలా అవుతాయి?' అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

'పీరియడ్స్ రావడానికి ముందే దేవుళ్లందరూ తరలి పోయారు. కాబట్టి ఇబ్బందేమీ రాలేదు. ఒకవేళ పీరియడ్స్ వచ్చిన దూరం నుంచి దైవ దర్శనం చేసుకుంటాను. పీరియడ్స్ అనేవి దేవుడు ఇచ్చినవి. అన్ని ఆయన నుంచి వచ్చినవే' అని అర్చన అంటున్నారు.

పీరియడ్స్ సమయంలో కొందరు మహిళలకు అసౌకర్యంగా ఉంటుంది. ఇది వ్యక్తులను బట్టి మారుతుంది. సాధారణంగా పొత్తి కడుపులో నొప్పి, కాళ్లు లాగడం, ఒళ్లు నొప్పులు వంటివి కనిపిస్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు నడుస్తూ యాత్ర చేయడం సులభమేనా?

'నాకు అదేమీ పెద్ద సమస్య కాదు. కానీ నడవడం వల్ల నా కాళ్లు నొప్పులు పుడతాయి. నొప్పి బిళ్లలు వేసుకుని ముందుకు సాగుతుంటాను. నడుస్తున్నప్పుడు రక్త స్రావం ఎక్కువగా అవుతుంది. అది కూడా నాకు సంతోషమే.

నాకు 4వ తారీఖున డేట్ వచ్చింది. వచ్చేటప్పుడు శానిటరీ ప్యాడ్స్ తెచ్చుకున్నాను. కాబట్టి ఇబ్బంది లేదు. దారిలోనే శానిటరీ ప్యాడ్స్ మార్చుకుంటూ ఉంటాం. చోటు దొరికినప్పుడే స్నానం చేస్తాం. కానీ ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నట్లుగా అన్ని సౌకర్యాలు ఉండవు. మగవారి సాయం తీసుకోకుండా ఆడవారే ఒకరికొకరు సాయం చేసుకుంటారు.' అని అర్చన చెప్పుకుంటూ పోయారు.

ఈ యాత్రలో పాల్గొనే మహిళలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ను గ్రామపంచాయతీలు, స్వయం సహాయక బృందాలు పంచుతున్నాయి. రుతుస్రావం జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు.

పండర్‌పుర్ వారీలో పాల్గొన్న వర్కారీ మహిళలు

శానిటరీ ప్యాడ్స్ లేని రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేది?

నాసిక్ జిల్లా నుంచి కమలాబాయి ఈ యాత్రకు వచ్చారు. శానిటరీ ప్యాడ్స్ లేని రోజుల్లోనూ మహిళలు పండర్‌పుర్ వారీకి వచ్చేవారని ఆమె తెలిపారు.

'ఆరోజుల్లో నేను గుడ్డలు వాడేదాన్ని. భోజనం కోసం మూడు గంటల పాటు ఆగినప్పుడు వాటిని ఉతుక్కుని ఆరబెట్టుకునే వాళ్లం. నేడు అమ్మాయిలు శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది పీరియడ్స్‌లో ఉన్న మహిళలు యాత్రలో పాల్గొంటున్నారు.' అని కమలాబాయి వివరించారు.

మొత్తానికి పండర్‌పుర్ వారీలో పాల్గొనడానికి పీరియడ్స్ అడ్డం కాదు అనేది ఇక్కడి మహిళలు చెబుతున్న మాట. వాటి వల్ల తాము ఆగిపోవాలని వీరు కోరుకోవడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
According to Pandarpur: 'Periods are given by Pandurangadu. It all belongs to Him'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X