సీఎం అవుతాడట: బీజేపీ ఎంపీని ఆటపట్టించిన కాంగ్రెస్ నేత..!!
Balaknath: తెలంగాణ తరహాలోనే రాజస్థాన్‌లో కూడా ప్రభుత్వం మారబోతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ చేతిలో మట్టికరిచిందిక్కడ.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కోసం అన్వేషణ సాగిస్తోంది బీజేపీ అధిష్ఠానం. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న వసుంధర రాజె చేతిలో ప్రభుత్వాన్ని పెట్టడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. కొత్త అభ్యర్థి కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. సరైన క్యాండిడేట్ దొరక్కపోతే వసుంధర రాజెకే పట్టం కట్టొచ్చు.

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో పాటు మహంత్ బాలక్‌నాథ్ యోగి పేర్లను పరిశీలిస్తోంది. జోధ్‌పూర్ నుంచి గజేంద్ర సింగ్ షెఖావత్, అల్వార్ నుంచి బాలక్‌నాథ్ యోగి.. లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్‌లో కీలకమైన జల్‌శక్తి మంత్రిత్వ శాఖను గజేంద్ర సింగ్ షెఖావత్ పర్యవేక్షిస్తోన్నారు.
ఉత్తరప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్‌లో కూడా సన్యాసికి ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోన్న నేపథ్యంలో బాలక్‌నాథ్ పేరు తెరమీదికి వచ్చింది. రాజస్థాన్‌కు కాబోయే ముఖ్యమంత్రి అయనేనంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం ఎక్కడిదాకా వెళ్లిందంటే.. పార్లమెంట్‌లో సైతం ఆయన పేరు వినిపిస్తోంది.
శీతాకాల సమావేశాల తొలి రోజు సెషన్ ముగిసిన తరువాత పార్లమెంట్ ఆవరణలో బాలక్‌నాథ్‌ను కలుసుకున్నారు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి. ఇద్దరూ ఒకేసారి బయటికి వచ్చారు. అక్కడే ఉన్న విలేకరులు వారిని పలకరించారు. రాజస్థాన్‌లో ఫలితాల గురించి అడిగారు.
దీనితో అధిర్ రంజన్ చౌధరి- బాలక్‌నాథ్ యోగిని చూపిస్తూ రాజస్థాన్‌కు కాబోయే కొత్త సీఎం అంటూ నవ్వుతూ ఆట పట్టించారు. చేతులు కలిపి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఏం పని చేస్తారని ప్రశ్నించారు. దీనికి రియాక్ట్ అయ్యారు మహంత్ బాలక్‌నాథ్ యోగి. నన్నొదిలేయండి.. అని హిందీలో అంటూ అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications