ఆదిపురుష్‌లో అడల్ట్ సీన్లు: A సర్టిఫికెట్: హైకోర్టు
లక్నో: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ.. ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలయింది. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా. నాసిరకం గ్రాఫిక్స్ వాడటం వల్ల రామాయణాన్ని చూస్తోన్న ఫీలింగ్ కలగట్లేదని చెప్పినవారూ లేకపోలేదు.
ప్రత్యేకించి- లంకలో రావణుడి ముందు హనుమంతుడు చెప్పే డైలాగులు తీవ్ర విమర్శల బారిన పడ్డ విషయం తెలిసిందే. గుడ్డ నీ బాబుది, తైలం నీ బాబుది, కాలేది కూడా నీ బాబుదే అంటూ హనుమంతుడు చెప్పే డైలాగ్.. విమర్శల సునామీని ఎదుర్కొంది. రామయణ స్ఫూర్తిని దెబ్బతీసిందంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు స్పందించింది. ఆదిపురుష్ సినిమాను నిషేధించాలంటూ దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందంటూ వ్యాఖ్యానించింది. ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేసే డైలాగులపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. మూవీ ప్రొడ్యూసర్లపై నిప్పులు చెరిగింది.
ఈ కేసులో రచయిత మనోజ్ మున్తాషిర్ శుక్లాను భాగస్వామిగా చేయాలని కోర్టు ఆదేశించింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసు జారీ చేసింది. సినిమాలోని డైలాగులు కొత్త సమస్యను తెచ్చి పెడుతున్నట్టు ఉన్నాయని అలహాబాద్ హైకోర్ట్ బెంచ్ వ్యాఖ్యానించారు. ప్రతి హిందువు కూడా రామచరితమానస్‌ను నిత్య పారాయణం చేస్తుంటారని, అలాంటి సినిమాలో కొన్ని సున్నిత అంశాలపై అవగాహన లేకుండా వ్యహరించారనేది స్పష్టమౌతోందని అన్నారు.

ఈ విషయంపై కూడా మనం కళ్లు మూసుకుని కూర్చుంటే, హిందువులు చాలా సహనంతో ఉంటారనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. సెన్సార్ బోర్డ్ తన బాధ్యతను నెరవేర్చిందా? లేదా అనే సందేహాలు కలుగుతున్నాయని పేర్కొంది. సినిమా చూసి ప్రజలు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతాన్ని తలపెట్టకపోవడం విశేషమేనని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అడల్ట్‌గా అనిపిస్తాయని, ఏ కేటగిరీకి చెందుతాయని కుండబద్దలు కొట్టింది. ఇలాంటి సినిమాలను చూడటం చాలా కష్టమని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోన్నామని, సెన్సార్ బోర్డు తన బాధ్యతలను తాను నిర్వర్తించినట్లు కనిపించట్లేదని బెంచ్ చురకలు అంటించింది.
సినిమాలో అభ్యంతరకరమైన డైలాగులను తొలగించామని డిప్యూటీ సొలిసిటర్ జనరల్.. బెంచ్‌కు తెలియజేశారు. దీనికి న్యాయమూర్తి బులిస్తూ- సెన్సార్ బోర్డు బాధ్యతలు ఏమిటో ఒక్కసారి అడగాలని సూచించారు. డైలాగులను మార్చడం ఒక్కటే సరిపోదని, కొన్ని అభ్యంతరకర సీన్లను ఏం చేస్తారని నిలదీశారు న్యాయమూర్తి. సినిమాలో డిస్‌క్లెయిమర్‌ను జోడించారంటూ ప్రతివాదుల చేసిన వాదనలను బెంచ్ పరిగణనలోకి తీసుకోలేదు.

శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, లంకను చూపిస్తూ ఇది రామాయణం కాదనే డిస్‌క్లెయిమర్‌ను జోడించడం వల్ల దేశ ప్రజలకు బుద్ధి లేదని చెప్పదలచుకున్నారా? అంటూ నిప్పులు చెరిగింది బెంచ్. ఈ సినిమాను చూసిన ప్రజలు ఆగ్రహానికి గురి కాకపోవడం, థియేటర్లల్లో ధ్వంసానికి పాల్పడకపోవడం వల్ల నిజంగా విశేషమని పేర్కొంది.












Click it and Unblock the Notifications