ఏ ముహూర్తాన కొత్త ఏడాదిలో అడుగు పెట్టామో గానీ..
Afghanistan earthquake: ఏ ముహూర్తాన కొత్త ఏడాదిలో అడుగు పెట్టామో గానీ ప్రకృతి విపత్తులు వదలట్లేదు. నీడలా వెంటాడుతూనే వస్తోన్నాయి. ఈ ఏడాది తొలి రోజు నాడే పెను భూకంపం సంభవించింది. అదే స్థాయిలో సునామీని చవి చూడాల్సి వచ్చింది. సరిగ్గా తొమ్మిది రోజుల వ్యవధిలో మరోసారి పెను భూకంపం సంభవించింది. ఓ చిన్న ద్వీప సముదాయాన్ని వణికింపజేసింది.
జనవరి 1వ తేదీన జపాన్‌లో సంభవించిన పెను భూకంపం, ఆ వెంటనే ఏర్పడిన సునామీ వల్ల 161 మంది మరణించిన విషయం తెలిసిందే. పలువురు గల్లంతయ్యారు. భవనాల శిథిలాల కింద వారంతా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికీ ఆ దేశ పశ్చిమ తీర ప్రాంతంలోని ఇషికవా ప్రీఫెక్షర్ రీజియన్ తేరుకోవట్లేదు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఆ విషాదం నుంచి తేరుకోక ముందే ఈ నెల 9వ తేదీన ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా రికార్డయింది. ఇండోనేషియాలోని టాలండ్ ఐలండ్‌ను వణికించింది. ఓ చిన్న ద్వీప సముదాయం కావడం, భూకంప తీవ్రత అధికంగా ఉండటం వల్ల సునామీ సంభవించవచ్చనే భయం జనాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసింది.
ఇప్పుడు తాజాగా మరోసారి పెను భూకంపం సంభవించింది. ఈ సారి ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించింది. హిందుకుష్ పర్వతశ్రేణుల్లో ఈ మధ్యాహ్నం 2:50 నిమిషాలకు భూమి ప్రకోపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. రాజధాని కాబుల్ నుంచి ఈశాన్యదిశగా 241 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.
దీని తీవ్రత అటు ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు పాకిస్తాన్, భారత్‌లోనూ కనిపించింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో భూకంప తీవ్రత నమోదైంది. ఇస్లామాబాద్, లాహోర్, పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖుషాబ్, సర్గోధా, మండీ బహౌద్దీన్, భక్కర్, నౌషేరాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి.
అటు దేశ రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భూమి కంపించింది. దీనితో స్థానికులు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఘజియాబాద్, గ్రేటర్ నొయిడా, గుర్‌గావ్.. వంటి నగరాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications