శ్రద్ధాను నేనే హత్య చేశా: కోర్టులో అఫ్తాబ్, గుర్తులేదంటూ షాక్, పోలీసుల అనుమానాలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా తన నేరాన్ని అంగీకరించాడు. మంగళవారం నిందితుడు అప్తాబ్‌ను సాకేత్ కోర్టు ఎదుట హాజరుపర్చారు ఢిల్లీ పోలీసులు. తాను ఆవేశంలోనే శ్రద్ధాను హత్య చేసినట్లు నిందితుడు అఫ్తాబ్ కోర్టు ముందు అంగీకరించాడు.

శ్రద్ధా హత్య క్షణికావేశంలోనేనన్న అఫ్తాబ్
ఈ ఘటన జరిగి చాలా రోజులు అయినందున తనకు ఘటనకు సంబంధించిన చాలా విషయాలు గుర్తుకు రావడం లేదని అఫ్తాబ్ చెప్పడం గమనార్హం. ఈ కేసులో అఫ్తాబ్ కు విధించిన ఐదు రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం అతడ్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాకేత్ కోర్టు ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా శ్రద్ధాను హత్య చేసింది తానేనని అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందో.. అదంతా ఘర్షణ వాతావరణంలో క్షణికావేశంలో జరిగిందని అఫ్తాబ్ చెప్పాడు.

హత్య గురించి గుర్తుకు రావడం లేదంటూ అఫ్తాబ్
ఈ కేసు దర్యాప్తునకు తాను సహకరిస్తానన్నాడు అఫ్తాబ్. శ్రద్దా శరీర భాగాలను విసిరేసిన ప్రాంతాల గురించి కూడా పోలీసులకు చెప్పినట్లు తెలిపాడు. అన్ని విషయాలు కోర్టుకు చెబుతానని, తాను చెప్పేవన్ని నిజాలేనని వెల్లడించాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడం లేదని, తనకు చాలా విషయాలు గుర్తుకు రావడం లేదని కోర్టుకు అఫ్తాబ్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు.

అఫ్తాబ్ చెబుతుంది నిజమేనా?
కాగా, శ్రద్ధాకు సంబంధించినవిగా చెబుతున్న 18 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అఫ్తాబ్ చెబుతున్న పలు ప్రాంతాల్లో శ్రద్ధా శరీరభాగాలు, హత్యకు ఉపయోగించిన పరికరాలు దొరక్కపోవడంతో.. అసలు అతడు నిజమే చెబుతున్నాడా? లేక తప్పుదోవ పట్టిస్తున్నాడా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడికి నార్కో ఎనాలసిస్ పరీక్ష, పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు, అఫ్తాబ్ పోలీసు కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. మరోవైపు, ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ పోలీసుల విచారణను అనుమానించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సీబీఐ విచారణ అవసరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.












Click it and Unblock the Notifications