చైనా వెళ్లేవారికి శుభవార్త..!!
సుదీర్ఘ విరామం తర్వాత భారత్, చైనాల మధ్య నేటి నుంచి నేరుగా విమాన సేవలు పునః ప్రారంభం కానున్నాయి. తొలి విమానం ఈ రాత్రి 10 గంటలకు బయలుదేరనుంది. కోల్‌కత నుండి గ్వాంగ్ఝౌకు బయలుదేరి వెళ్లనుంది. ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ ఇండిగో విమానం ఇది. ఆ సంస్థ చైనాకు తొలి విమాన సేవలను అందించనుంది. అయిదు సంవత్సరాల తర్వాత ఈ రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.
దీని తర్వాత నవంబర్ 9న మరో ఫ్లైట్ నడుస్తుంది. షాంఘై నుండి న్యూఢిల్లీకి ఈ విమానం రాకపోకలు సాగిస్తుంది. ఆ మరుసటి రోజే అంటే 10న ఢిల్లీ-గ్వాంగ్ఝౌ రూట్ లో మరో ఇండిగో విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఇది ఒక్క విమానాలకు మాత్రమే పరిమితం కావట్లేదు. చైనా పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ఇతర సందర్శకులకు విసాలను మంజూరు చేయాలని కూడా భారత్ గతంలోనే నిర్ణయించింది. ఇది వరకు నిలిపివేసిన విసాల జారీని పునరుద్ధరించింది కూడా.

2020లో విమాన సర్వీసులను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. లఢక్ తూర్పు ప్రాంతం సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో 2020 జూన్ 15, 16వ తేదీల్లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆ ఘర్షణల్లోనే తెలంగాణకు చెందిన కల్నల్ బీకుమల్ల సంతోష్ బాబు అమరుడయ్యారు. ఈ ఘర్షణల నేపథ్యంలో అప్పట్లో విమానాలతో పాటు విసాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఈ ఘర్షణలు జరిగినప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద యుద్ధ వాతావరణం కొనసాగుతూనే వచ్చింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సరిహద్దు వెంబడి రెండు వైపులా వేలాదిమంది సైనికులు మోహరించారు. పాంగ్యాంగ్ త్సో సరస్సు, గాల్వన్ వ్యాలీ, డెప్సాంగ్, డెమ్‌చోక్ వంటి ప్రాంతాల్లో సైనికులు యుద్ధానికి సిద్ధం అయ్యారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఆర్మీ కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు ఏర్పాటయ్యాయి. అనేక దఫాలుగా సాగాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న విభేదాలను రూపుమాపేలా, శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ముందడుగు వేశాయి.
ఇటీవలే ప్రధాని మోదీ చైనాలో సైతం పర్యటించారు. అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో మోదీ ముఖాముఖి భేటీ అయ్యారు. టియాన్జిన్ లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సైడ్ లైన్స్ లో భాగంగా ఈ భేటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
Direct flights between China and India are now a reality.
— Yu Jing (@ChinaSpox_India) October 26, 2025
✈️ Kolkata → Guangzhou launches today.
Shanghai ↔ New Delhi starts Nov 9, flying 3 times a week. pic.twitter.com/rxa0ag4jFd












Click it and Unblock the Notifications