ఆ 23 మందిపై విమర్శలు... తక్షణం రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న అహ్మద్ పటేల్...
కాంగ్రెస్ సారథ్య బాధ్యతలపై నెలకొన్న సంక్షోభం ఆ పార్టీని కుదిపేస్తోంది. ఓవైపు పార్టీలో వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమన్న వాదన... మరోవైపు మెజారిటీ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికీ గాంధీ కుటుంబ నాయకత్వాన్నే బలపరుస్తున్న పరిస్థితులు... చివరకు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న గందరగోళం పార్టీని వెంటాడుతోంది. ఇక ఇదే అదనుగా కాంగ్రెస్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ దూకుడైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతోంది.
Recommended Video
తాజా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్.. తక్షణమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిందిగా రాహుల్ గాంధీని కోరారు. అంతేకాదు,అసమ్మతి స్వరం వినిపించిన 23 మంది సీనియర్ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాంనబీ ఆజాద్,ముకుల్ వస్నిక్,ఆనంద్ శర్మ లాంటి నేతలు పార్టీలో ఎన్నో కీలక పదవులను చేపట్టారని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు పార్టీలో మార్పులు అవసరమంటూ అధిష్టానానికి వారు లేఖ రాయడాన్నిఆయన తప్పు పట్టారు.

మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య కూడా రాహుల్ గాంధీనే తిరిగి పగ్గాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఒకవేళ మీ ఆరోగ్యం సహకరించకపోతే... అధ్యక్ష పదవి చేపట్టడం కోసం రాహుల్‌ను ఒప్పించాలని లేఖలో సోనియాను కోరారు. అదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలిగా మీరే కొనసాగాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.

నేటి(అగస్టు 24) సీడబ్ల్యూసీ సమావేశానికి కమిటీలోని శాశ్వత సభ్యులందరితో పాటు ప్రత్యేక అతిథులు కూడా పాల్గొన్నారు. ఉదయం 11గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదలైన ఈ సమావేశం ఇప్పటికీ కొనసాగుతోంది. సోనియా అధ్యక్ష పదవిని చేపట్టి ఏడాది పూర్తి కావాల్సి వస్తున్న సందర్భంలో జరుగుతున్న ఈ సమావేశం చివరకు ఏం తేలుస్తుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications