విమాన ప్రమాద ఘటనపై మోదీ కీలక ఆదేశాలు.. ఘటనా స్థలికి అమిత్ షా!
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ ప్రాంతంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానం కూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈప్రమాదం సృష్టించిన బీభత్సంలో దాదాపు అందరూ మృతి చెందినట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
విమానం కూలిన ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్బ్రాంతి.. రామ్మోహన్ నాయుడితో ఆరా
అహ్మదాబాద్‌లో విమానం కూలిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాద ఘటన పైన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తో మాట్లాడి ఆరా తీశారు. రక్షణ, సహాయ కార్యకలాపాలు పర్యవేక్షించడానికి రామ్మోహన్ నాయుడు స్వయంగా అహ్మదాబాద్ వెళుతున్నట్టు ప్రధానమంత్రికి సమాచారం అందింది.

పౌరవిమానయాన శాఖా మంత్రికి కీలక ఆదేశాలు
పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో మాట్లాడి అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనను సమీక్షించిన ప్రధాని. అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని, పరిస్థితిపై క్రమం తప్పకుండా సమాచారం అందించాలని ప్రధానమంత్రి మంత్రిని ఆదేశించారు.అహ్మదాబాద్‌లో విమానం కూలిన నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అక్కడ సహాయక కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్లారు. ఈ ఘటనపై డీజీసీఏ, ఎయిరిండియా, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో కేంద్రమంత్రి సంప్రదింపులు జరుపుతున్నారు.
విమానం కూలిన ఘటనపై హోంమంత్రి అమిత్‌షా తీవ్ర దిగ్భ్రాంతి
విమానం కుప్పకూలిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి తెలుసుకొన్నారు.అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశారు. విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.
అమిత్ షా తో మాట్లాడిన ప్రధాని మోదీ
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ విచారం వ్యక్తం చేశారు. ఈ సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడంపైనే ప్రధాన దృష్టి ఉందని అన్నారు. సమాచారం కోరుకునే కుటుంబాల కోసం అత్యవసర కేంద్రం ప్రారంభించామని తెలిపారు. అమిత్ షా తో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమాన విమాన ప్రమాదం తర్వాత బాధితులకు సాధ్యమైనంత సహాయం అందేలా చూడాలన్నారు.
మోదీ ఆదేశాలతో ఘటనా స్థలికి అమిత్ షా
తక్షణ సహాయం అందించాలని ప్రధాని మోదీ అమిత్ షా ను ఆదేశించారు. మరోవైపు ప్రధాని మోదీ ఆదేశాలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని స్థానిక అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తానే స్వయంగా వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని గుజరాత్ ప్రభుత్వానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఘటనా స్థలంలో వీలైనన్ని అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications