AIADMKకు మరో బిగ్ షాక్..! విజయ్ పార్టీలోకి నలుగురు మాజీ మంత్రులు..!
తమిళనాడులో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన అన్నాడీఎంకే (AIADMK) కు వరుస షాకులు తప్పడం లేదు. ఇప్పటికే పార్టీని వీడి పలువురు ఎమ్మెల్యేలు అధికార టీవీకేలోకి ఫిరాయించగా.. ఇప్పుడు మాజీ మంత్రులు సైతం షాకులిస్తున్నారు. ఇవాళ చెన్నైలోని టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాడీఎంకేకు చెందిన నలుగురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యక్షమై కండువాలు మార్చేసుకున్నారు.
అన్నాడీఎంకేకు గుడ్ బై చెప్పిన వారిలో ఉడుమలై కె రాధాకృష్ణన్, ఎంసి సంపత్, కడంబూర్ సి రాజు, ఎన్ ఆర్ శివపతి ఉన్నారు. వీరిని టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్, ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తమ పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి ఎన్నికల్లో ఓటమి తర్వాత 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల బృందం పార్టీ విప్‌ను ధిక్కరించి, అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చింది. ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో నలుగురు ఆ తర్వాత అసెంబ్లీకి రాజీనామా చేసి టీవీకేలో చేరారు. చివరకు ఆ తిరుగుబాటు వర్గం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామితో రాజీ చేసుకుంది.

ఆ తర్వాత కూడా పలువురు అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు పార్టీని వీడి అధికార పార్టీలో చేరారు. ఇలా ప్రతిపక్ష పార్టీ నుండి జరుగుతున్న వరుస ఫిరాయింపులలో ఈ నలుగురు మాజీ మంత్రుల చేరిక కూడా చేరిపోయింది. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రుల్లో రాధాకృష్ణన్ ఉడుమల్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోగా, సంపత్ కడలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడో స్థానంలో నిలిచారు. కోవిల్‌పట్టిలో కడంబూర్ రాజు ఓటమి పాలయ్యారు. మరోవైపు టీవీకేలో చేరిన తొలితరం ప్రముఖ అన్నాడీఎంకే నేతల్లో సెంగోట్టయ్యన్ ఒకరు. ఆయన ఎన్నికలకు చాలా కాలం ముందే విజయ్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.














Click it and Unblock the Notifications