Tamil Nadu: నిలువుగా చీలిన అన్నాడీఎంకే-పళనిస్వామిపై 30 ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
తమిళనాడులో తాజాగా ఎన్నికలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో విపక్ష అన్నాడీఎంకే (AIADMK) నిట్టనిలువుగా చీలిపోయింది. విజయ్ కు మద్దతుగా నిలిచేందుకు అధినేత పళనిస్వామి సహకరించకపోవడంతో కొత్తగా ఎన్నికైన మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తితో వేరు కుంపటి పెట్టుకున్నారు. దీంతో అన్నాడీఎంకేలో పళనిస్వామికి మద్దతుగా కేవలం 17 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. మిగిలిన వారంతా సీనియర్ నేత షణ్ముగం నేతృత్వంలో మరో వర్గంగా చీలిపోయారు.
17వ తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే అన్నాడీఎంకేలోని అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. పార్టీ తరఫున కొత్తగా ఎన్నికైన 47 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేర్వేరు బృందాలుగా హాజరయ్యారు. పళనిస్వామిని ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా సమర్థిస్తూ 17 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు తాత్కాలిక స్పీకర్ కరుప్పయ్యకు ప్రతిపాదన సమర్పించారు. 30 మంది ఎమ్మెల్యేలు ఆ లేఖపై సంతకం చేయలేదు. తిరుగుబాటు వర్గం పళనిస్వామి ముందు పలు డిమాండ్లు పెట్టింది. ఇందులో వేలుమణిని శాసనసభ పక్ష నాయకుడిగా, షణ్ముగంను ఉప నాయకుడిగా నియమించడం, పార్టీ కీలక నిర్ణయాలను పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి.

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం, శాసనసభా పక్షంలో చీలిక ఏర్పడితే అనర్హతను నివారించడానికి కనీసం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు, అంటే 47 మందిలో 32 మంది మద్దతు అవసరం. ప్రస్తుతం షణ్ముగం, వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి సుమారు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వారికి అవసరమైన సంఖ్యకు కేవలం ఇద్దరు మాత్రమే తక్కువగా ఉన్నారు. దీంతో ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని సి.వి. షణ్ముగం మద్దతు ఉన్న మరో వర్గం సి. విజయభాస్కర్‌తో సహా పలువురు సీనియర్ నాయకులతో కలిసి విడిగా అసెంబ్లీకి చేరుకుంది. అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చినప్పటికీ.. షణ్ముగం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాకుండా పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చారు.














Click it and Unblock the Notifications