ప్రధాని మోదీ లేటెస్ట్ ఇన్ స్టా వీడియో: దేశ ప్రజలకు పిలుపు
ఇంకొద్ది రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోబోతోన్నాం. ఇవి.. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఈ నెల 15వ తేదీన శనివారం నాడు దేశ రాజధానిలోని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక ప్రకటనలను చేసే అవకాశాలు లేకపోలేదు. గత ఏడాది ఇండిపెండెన్స్ డే నాడు జీఎస్టీ రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని మోదీ లేటెస్ట్ వీడియోతో ప్రజల ముందుకొచ్చారు. దీన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని పెంపొందించడానికి హర్ ఘర్ తిరంగా మూవ్ మెంట్ ను మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లోనూ మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని, ఓ పండగలా జరుపుకోవాలని కోరారు.

దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బలిదానాలు చేసిన అమరవీరులకు నివాళుి అర్పించడానికి దీన్ని ఓ అద్భుత అవకాశంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మన జాతీయ జెండాతో పట్ల ఉన్న అపారమైన గౌరవాన్ని, దేశభక్తి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ మున్ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. స్వతంత్ర భారత అమర వీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు,దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, ఈ దిశగా అందరూ ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.
ఇదొక స్వాతంత్ర్య దినోత్సవం మాత్రమే కాదని, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం అయ్యే రోజు అని మోదీ గుర్తు చేశారు. దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి పౌరుడూ ఒక సంకల్పాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమర వీరుల కలలు కన్న స్వరాజ్యాన్ని సాధించడానికి, అభివృద్ధి లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి ఈ సందర్భం ఎంతో కీలకంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. దేశ ప్రజలు తమ వ్యక్తిగత బాధ్యతలను గుర్తుంచుకుంటూ దేశ పురోగతికి తోడ్పడాలని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తిరంగా యాత్రలు, వైవిధ్యభరిత కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ రక్షణ రంగాలు, వివిధ విద్యాసంస్థలు, ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాయి. ఇటీవలే జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్‌లో సీఆర్‌పీఎఫ్ దళాలు, స్థానిక పాఠశాల విద్యార్థులు కలిసి భారీ తిరంగా ర్యాలీని చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా ఇటువంటి ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ఏపీలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కు పిలుపునిచ్చారు.













Click it and Unblock the Notifications