చంద్రుడిపై బేస్ స్టేషన్ + అంతరిక్ష పరిశోధన కేంద్రం: నాసా పార్ట్‌నర్ గా ఇస్రో.. !!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో ఓ నూతన అధ్యాయం వైపు అడుగులు వేస్తోంది. చంద్రుడిపై నిర్మించతలపెట్టిన మూన్ బేస్ మిషన్ లో ఇస్రో భాగస్వామ్యం కాబోతోంది. ఈ మేరకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నుంచి ఆహ్వానం అందింది. అంతరిక్ష రంగంలో భారత్- అమెరికా మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ప్రతిపాదన తెరమీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉపగ్రహాల ప్రయోగానికే పరిమితం కాకుండా మానవసహిత అంతరిక్ష యాత్రలు, చంద్రుడిపై శాశ్వత పరిశోధనల దిశగా ఇరు దేశాలు సంయుక్తంగా అడుగులు వేస్తోన్నాయి. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో తొమ్మిదవ భారత్-అమెరికా పౌర అంతరిక్ష జాయింట్ వర్కింగ్ సమావేశం సందర్భంగా నాసా ఈ ప్రతిపాదన పెట్టింది. ఇస్రోకు ఆహ్వానాన్ని సైతం అందజేసింది. మూన్ బేస్ మిషన్ ఆధారంగా ఆర్టెమిస్ కాంట్రాక్ట్ పరిధిని మరింత విస్తృతం కానుంది.

ఈ నూతన భాగస్వామ్యం ద్వారా చంద్రుడిపై పరిశోధనలతో పాటు శాస్త్రీయ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఇస్రో- నాసా అంగీకారం తెలిపాయి కూడా. ఈ సమావేశానికి ఇస్రో చైర్మన్ వీ నారాయణన్, భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ ఎం శంకరన్, అమెరికా విదేశాంగ శాఖ సహాయ కార్యదర్శి వెస్లీ బ్రూక్స్, నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ కాథ్లీన్ కరికా హాజరయ్యారు.
గత ఏడాది నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ప్రాజెక్ట్ విజయం తర్వాత, ఈ రెండు దేశాలు సంయుక్తంగా మళ్లీ అంతరిక్ష ప్రయోగాల వైపు చూపు సారించడం ఇదే మొదటిసారి. స్పేస్ రీసెర్చ్ లో తమ బంధాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే మూన్ బేస్ నిర్మాణంలో ఇస్రో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది నాసా. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ కే పరిమితం కాకుండా మానవసహిత ప్రయోగాలు, భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష యాత్రలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ నుంచి లభించే సాంకేతిక నైపుణ్యం ఎంతగానో దోహదపడుతుందని అమెరికా భావిస్తోంది. అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక సుస్థిరత కోసం ఐక్యరాజ్యసమితి రూపొందించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని భారత్, అమెరికా ఇప్పటికే పునరుద్ఘాటించాయి కూడా. అంతరిక్షంలో వ్యర్థాల నియంత్రణ, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, విశ్వంలో మానవ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంతర్జాతీయ నిబంధనలను పాటించడం అత్యంత కీలకం కానుంది.
భారత్ సొంతంగా చేపడుతున్న గగన్‌యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రకు కూడా అమెరికా సాంకేతిక సహకారం ఎంతో కీలకం కానుంది. స్పేస్ విజన్ లక్ష్యాల సాధనలో భాగంగా చంద్రుడిపై మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని భారత్ భావిస్తోంది. చంద్రయాన్ 3 ల్యాండర్ అడుగుపెట్టిన శివశక్తి పాయింట్ ఇప్పటికే చంద్రుడిపై భారత్ సత్తాకు ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు నాసాతో జతకట్టడం ద్వారా చంద్రుని పునరాగమన ప్రస్థానంలో భారత్ తన విశిష్ట స్థానాన్ని దక్కించుకోనుంది.















Click it and Unblock the Notifications