భారత్ - పాక్ మ్యాచ్ వేళ అసద్ సంచలనం..!!
దుబాయ్ లో ఆసియా కప్ లో భారత్ -పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పహల్గామ్ ఘటన... ఆపరేషన్ సింధూర్ తరువాత పాక్ పైన దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా భారత్ - పాక్ మ్యాచ్ కు కనిపించే స్పందన ఈ సారి కనిపించటం లేదు. రక్తం - క్రికెట్ కలిసి ఆడతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎంఐఎం అధినేత అసద్ ఈ మ్యాచ్ వేళ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్రం తీరు పైన మండిపడ్డారు.
ఆసియా కప్ లో భారత్ - పాక్ మ్యాచ్ పైన రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు పాక్ తో భారత్ మ్యాచ్ ఆడటాన్ని తప్పు బడుతూ ప్రకటనలు వస్తున్నాయి. బీసీసీ ఈ మ్యాచ్ నుంచి దూరంగా ఉంటోంది. కాగా, మ్యాచ్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహాల్గామ్ దాడిలో అమాయకులను చంపిన వారికి మద్దతుగా నిలిచిన దేశంతో ఆటలేంటి అని ప్రశ్నించారు.

దాదాపు ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పోయాయని, ఆ ప్రాణాల కంటే ఒక మ్యాచ్ ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ఆదాయం ముఖ్యమా? అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. పహాల్గామ్ దాడిలో భారత పౌరులను మతం అడిగి మరీ కాల్చి చంపిన పాకిస్థాన్ తో క్రికెట్ ఆడవద్దని చెప్పే శక్తి మీకు లేదా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాణాల కంటే ఆటలు ముఖ్యమా? అని అసదుద్దీన్ నిలదీశారు.
అయితే.. ఈ మ్యాచ్‌పై కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ... భారత్‌పై ఎగదోస్తున్న పాక్‌తో క్రికెట్ ఆడడమేంటని నాయకులు నిలదీస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తున్నారు. ''నాటి దాడిలో ఎంతో మంది మహిళల సిందూరాన్ని చెరిపేసిన పాక్‌తో ఇప్పుడు క్రికెట్ అవసరమా'' అని అనేక మంది నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పాకిస్థాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ''నీరు-రక్తం కలిసి ప్రవహించవని.. సిందూ జలాల విషయంపై మీరే ఉద్ఘాటించారు. కానీ, ఇప్పుడు రక్తం-క్రికెట్ కలిసి ఆడుతాయా.. ఇదెలా అంటూ అని శివసేన(యూబీటీ) అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోదీని నిలదీశారు.












Click it and Unblock the Notifications