ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్: స్కూళ్లు మూసివేత..ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్: కేజ్రీవాల్ సంచలనం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రోజురోజుకూ వాయు కాలుష్యం మితి మీరి పోతోంది. ఊపిరి సలపనివ్వని పరిస్థితులకు కారణం అవుతోంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి మొత్తం విషపూరితమైంది. కాలుష్యం తీవ్రత మరింత అధికమైంది. కాలుష్యం స్థాయి నానాటికీ పెరుగుతోంది. వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పులు కూడా దీనికి తోడయ్యాయి. ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యం పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ ప్రకటించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సైతం ఢిల్లీ ప్రభుత్వానికి సూచించారు.

కఠిన ఆంక్షలను ప్రకటించిన కేజ్రీవాల్
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో లాక్‌డౌన్ తరహా పరిస్థితులను ప్రకటించారు. కఠిన ఆంక్షలను విధించారు. సోమవారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కొద్దిసేపటి కిందటే ఆయన వాటిని ప్రకటించారు. వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజల ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

స్కూళ్లు క్లోజ్..
ఎల్లుండి నుంచి ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో వారం రోజుల పాటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆన్‌లైన్, వర్చువల్ విధానంలో విద్యాబోధన కొనసాగుతుందని అన్నారు. విద్యార్థులు భౌతికంగా పాఠశాలలకు వెళ్లడాన్ని ఈ వారం రోజుల పాటు నిషేధించామని చెప్పారు. పాఠశాల విద్యార్థులు వాయు కాలుష్యం బారిన పడకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్, వర్చువల్ విధానంలో తరగతులను నిర్వహించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

నిర్మాణ పనులు నిలిపివేత..
వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. 14వ తేదీ నుంచి 17 వరకు అంటే ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో ఎలాంటి నిర్మాణ పనులకు కూడా అనుమతి ఇవ్వట్లేదని చెప్పారు. భవనాలతో పాటు అన్ని రకాల నిర్మాణ పనులను ఈ నాలుగు రోజుల పాటు నిలిపివేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తరువాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాలుష్యం తగ్గకపోతే.. మరి కొద్దిరోజుల పాటు నిర్మాణ పనులను పొడిగించే అవకాశాలు లేకపోలేదు.
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించినట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీన్ని వందశాతం మేర అమలు చేస్తామని అన్నారు. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇళ్ల నుంచే తమ విధులను నిర్వర్తించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదివరకు లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఎలా పరిమితం అయ్యారో.. అదే విధంగా రోజువారీ విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. ప్రైవేటు కార్యాలయాలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాలని సూచిస్తున్నానని అన్నారు.

పూర్తి స్థాయి లాక్‌డౌన్ కోసం పరిశీలిస్తున్నాం..
కాగా- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన సూచనలను తాము పరిగణనలోకి తీసుకున్నామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధించడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, దీనిపై వర్కవుట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌ను విధించడం అనేది చిట్టచివరి ప్రయత్నం అని, అది ఎక్స్‌ట్రీమ్ స్టెప్ అవుతుందని వ్యాఖ్యానించారు. అందుకే- కేంద్ర ప్రభుత్వం, పోలీసులు.. ఇలా అన్ని విభాగాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. నిర్మాణ పనులు, వాహనాల రాకపోకలు, పరిశ్రమలను మూసివేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇది పరిశీలన దశలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications