CJI NV Ramana: ఇంట్లో కూడా మాస్కులేసుకుంటున్నాం: ఇన్నాళ్లు ఏం చేశారు: మోడీ సర్కార్‌పై ఫైర్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రోజురోజుకూ వాయు కాలుష్యం మితి మీరి పోతోంది. ఊపిరి సలపనివ్వని పరిస్థితులకు కారణం అవుతోంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీ వ్యాప్తంగా కాలుష్యం తీవ్రత మరింత తీవ్రతరమైంది. కాలుష్యం స్థాయి పెరుగుతోంది. వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పులు దీనికి తోడయ్యాయి. భారీ వర్షాలు కురవడం, చలి తీవ్రత క్రమంగా పెరుగుతుండటం మరో కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యం పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఏ చర్యలు తీసుకున్నారు?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయిందని, దాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ప్రత్యేక ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఈ బెంచ్‌లో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఆదిత్య దుబే అనే 17 సంవత్సరాల విద్యార్థి ఈ పిటీషన్‌ను వేశారు.

ఇంట్లో కూడా మాస్కులు వేసుకోవాల్సి వస్తోంది..
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంట్లో కూడా బలవంతంగా మాస్కులను ధరించాల్సిన పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలను తీసుకున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఓ రెండ్రోజులు లాక్‌డౌన్ పెట్టండి..
పొరుగునే ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున ఎండుగడ్డిని దగ్ధం చేస్తున్నారని, దాని ప్రభావం ఢిల్లీ వాతావరణంపై పడుతోందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కనీసం రెండు రోజుల పాటు లాక్‌డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాజకీయాలకు అతీతంగా చర్యలను తీసుకోవాల్సి ఉందని హితవు పలికారు.

సీడర్ మిషన్లను కొనుగోలు చేసే స్థోమత రైతులకు ఉందా?
దేశంలో లక్షలాదిగా సీడర్ మిషన్లు అందుబాటులో ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, వాటిని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత రైతులకు ఉందా? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. రైతులు దగ్ధం చేస్తోన్న ఎండుగడ్డిని పశువులకు ఆహారంగా వేసేలా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని అన్నారు. నాలుగు వేల మందికి పైగా రైతులు ఎండుగడ్డిని దగ్ధం చేస్తోండటం వల్ల అందులో నుంచి వెలువడే పొగ ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణమౌతోందని ప్రభుత్వం చెబుతోంది.

రైతు కుటుంబాల నుంచి వచ్చాం..
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపిస్తూ- కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల సీడర్ మిషన్లను అందుబాటులో తీసుకొచ్చిందని, 80 శాతం సబ్సిడీతో వాటిని రైతులు కొనుగోలు చేసేలా వెసలుబాటును కల్పించిందని చెప్పారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ- సీడర్ యంత్రాల సబ్సిడీ ధర ఎంతో ఖచ్చితంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. సీజేఐ ఎన్వీ రమణ, తాను రైతు కుటుంబాల నుంచి వచ్చామని, వాటి ధర ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నామని అన్నారు.

కేంద్రాన్ని ఏమీ అనొద్దు.. తప్పంతా రైతులదే..
దీనికి తుషార్ మెహతా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. చిన్న, సన్నకారు రైతుల కోసం సీడింగ్ మిషన్లను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని చెప్పారు. రైతుల నుంచి ఉచితంగా ఎండుగడ్డిని తీసుకుని, దాన్ని పరిశ్రమలకు సరఫరా చేయాలని న్యాయమూర్తులు సూచించారు. ఢిల్లీ వాయు కాలుష్యం పెరగడంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని, రైతులు ఎండుగడ్డిని కాలుస్తుండటమే ప్రధాన కారణమని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications