AJIT PAWAR: అజిత్ పవార్ కు తీరని ఆ కల, అరుదైన ప్రస్థానం..!!
అజిత్ పవార్ మరణం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో షాకింగ్ గా మారింది. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణం మరాఠా రాజకీయాల్లో విషాదం నింపింది. మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న అజిత్ పవార్ రాజకీయ వ్యూహకర్తగా పేరు సాధించారు. బాబాయ్ అడుగుజాడల్లో తొలి నుంచి రాజకీయగా అనేక ఆటు పోట్లు ఎదుర్కొన్న అజిత్ పవార్ ఆరు సార్లు డిప్యూటీ సీఎం గా మహారాష్ట్రలో అరుదైన రికార్డు దక్కించుకున్నారు. అయితే, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న అజిత్ పవార్ కు రాజకీయంగా మాత్రం తన కల నెరవేరకుండానే అస్తమించారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన అజిత్ పవార్ ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. 1982లో సహకార చక్కెర కర్మాగారం పాలక మండలిలో సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగారు. అజిత్ రాజకీయంగా ప్రవేశించే సమయానికి శరద్ పవార్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. 2023 జులై 1 వరకు శరద్ పవార్ అడుగు జాడల్లోనే అజిత్ నడిచారు. కానీ 2023 జులై 2న ఎన్సీపీని సొంతం చేసుకున్నారు. విధేయత.. చతురత అజిత్ పవార్ సొంతం. అహ్మద్‌నగర్‌లోని దేవ్‌లాలి ప్రవర గ్రామంలో 1959 జులై 22న జన్మించారు.

పవార్ కుటుంబానికి నేటికీ మహారాష్ట్రలోని పుణె, సతారా, సంగ్లి, కొల్హాపూర్, సోలాపూర్, అహ్మద్ నగర్ జిల్లాలపై మంచి పట్టు ఉంది. 1991లో పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ పాలక మండలి ఛైర్మన్‌గా అజిత్ ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఏకంగా 16 ఏళ్లపాటు కొనసాగారు. 1191 లో అజిత్ పవార్ అజిత్ ఎంపీ అయ్యారు. ఆ వెంటనే పీవీ నర్సింహారావు సర్కారులో రక్షణ మంత్రి పదవిని శరద్ పవార్ దక్కించుకున్నారు. బారామతి నుంచి అజిత్ వరుసగా 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు.
తొలిసారి 1991 బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన గెలిచారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ, ఇంధన శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. 1992లో శరద్ పవార్ మహారాష్ట్ర సీఎం అయ్యారు. ఈ టర్మ్‌లో రాష్ట్ర ప్రణాళిక, ఇంధన, నేల సంరక్షణ శాఖ సహాయ మంత్రి పదవిని అజిత్ పొందారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసారు. 1999లో మహారాష్ట్రలో ఏర్పడిన కాంగ్రెస్ - ఎన్‌సీ‌పీ సంకీర్ణ సర్కారులో కీలకంగా వ్యవహరించారు. మంత్రి పదవులను పొందుతూనే, మరోవైపు పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో ఎన్‌సీపీ బలోపేతానికి పని చేసారు.
మహారాష్ట్రలో అత్యధిక కాలం పాటు డిప్యూటీ సీఎంగా సేవలు అందించిన రికార్డు అజిత్ పవార్ పేరిటే ఉంది. ఇప్పటివరకు ఆయన 6సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అజిత్ పవార్‌కు భార్య సునేత్రా పవార్, ఇద్దరు కుమారులు పార్థ పవార్, జై పవార్ ఉన్నారు. ప్రస్తుతం సునేత్రా పవార్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు పార్థ పవార్ 2019 లోక్‌సభ ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ముఖ్యమంత్రి అవ్వాలనే అజిత్ పవార్ కోరిక మాత్రం నెరవేరలేదు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణం ఇప్పుడు ఆయన అనుచరులకు తీరని విషాదంగా మారింది.












Click it and Unblock the Notifications