కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన అఖిలేష్ యాదవ్
లక్నో: ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన విపక్షాల కూటమి ఇండియా(I.N.D.I.A)లో తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని ఆరోపిస్తున్న విపక్షాలు.. సొంత నిర్ణయాలు తీసేసేకుంటున్నాయి. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మరో అడుగు ముందుకేశారు.
కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు అఖిలేష్ యాదవ్. వచ్చే లోక్‌సభ (Lok Sabha) విపక్ష పార్టీలు కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే, అనూహ్యంగా ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌కు మైన్‌పురి స్థానాన్ని ఖరారు చేసింది సమాజ్ వాదీ పార్టీ. అయితే, కూటమిలో మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు పక్కన పెట్టినట్లు ఎస్పీ తెలిపింది. ఈ విషయంపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. పార్టీ ఏదీ ఉత్తమమైందని భావిస్తుందో అదే చేస్తుందని అఖిలేష్ తెలిపారు.
కాంగ్రెస్ నుంచి దీనికి ఎటువంటి క్లియరెన్స్ అవసరం లేదన్నారు అఖిలేష్. మరోవైపు,
కాంగ్రెస్ పార్టీతో కాకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించాయి. ఇది ఇలావుంటే, ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చి ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా కూటమిలోని పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా? లేక ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications