Akhilesh Yadav: మహాకుంభమేళా మృతుల సంఖ్యను ఎందుకు దాస్తున్నారు?
Akhilesh Yadav: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో ఇటీవల తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. మహాకుంభమేళా ఘటనలో మృతుల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో చర్చలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్.. మహాకుంభమేళా నిర్వహణలో లోపాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ మృతదేహాలు తొలగించడానికి ప్రభుత్వం జేసీబీ యంత్రాలను, ట్రాక్టర్లను ఉపయోగించిందని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నిరంతరం బడ్జెట్ లెక్కలను చెబుతూనే ఉందని.. అదే విధంగా మహాకుంభమేళాలో మరణించిన వారి గణాంకాలను కూడా ఇవ్వాలన్నారు.అక్కడి ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కుంభమేళా నిర్వహణ బాధ్యతలను ఆర్మీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మహా కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి గణాంకాలు, గాయపడిన వారికి చికిత్స, మందులు, వైద్యులు, ఆహారం, నీరు, రవాణా లభ్యత వంటి వివరాలను పార్లమెంటులో సమర్పించాలని ఆయన అన్నారు. నేరం లేకుంటే గణాంకాలను ఎందుకు దాస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

దేవుడి ఆశీస్సులు పొందడానికి వచ్చిన వారు మృతదేహాలతో వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు. అద్భుతం ఏమిటంటే ప్రభుత్వం మృతదేహాలను కనుగొన్నప్పటికీ సంఖ్యలను అంగీకరించడానికి నిరాకరించిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బాధితుల మృతదేహాలు మార్చురీలో పడి ఉన్నప్పుడు ప్రభుత్వం హెలికాప్టర్ నుండి పూల రేకులను కురిపించిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై విచారం కూడా వ్యక్తం చేయలేదని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఈ విషాదం పట్ల రాష్ట్రపతి, ప్రధాని విచారం వ్యక్తం చేసిన దాదాపు 17 గంటల తర్వాత ఆయన విచారం వ్యక్తం చేశారన్నారు.
ఈ ఘటన అంత పెద్దదేం కాదు:హేమమాలిని
మహాకుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మరణించడంపై బీజేపీ ఎంపీ వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ఘటన అంత పెద్దదేం కాదని.. దానిని అలా అతిశయోక్తి చేస్తున్నారన్నారు. తాము కూడా మహాకుంభమేళాకు వెళ్లామని హేమమాలిని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు ప్రయాగ్ రాజ్ వెళ్లి పవిత్ర స్నానం చేస్తారని.. పరిస్థితి అదుపులో లేకపోతే ప్రధాని వెళ్లేవారా అంటూ హేమమాలిని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ కుంభమేళా ఘటన గురించి ప్రశ్నలు లేవనెత్తగా.. తప్పులు మాటలు మాట్లాడడమే అఖిలేష్ పని అని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications