UP Elections 2022: యోగీ ఎఫెక్ట్: యూపీలో పోటీపై అఖిలేష్ యూ టర్న్-ఆజంగఢ్ నుంచి బరిలోకి ?
యూపీలో ఎన్నిక వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉండాల్సిన అఖిలేష్.. పోటీకి దూరమైతే పడే ప్రభావంపై పార్టీ నుంచి ఎదురవుతున్న ఒత్తిడితో ఆయన యూటర్న్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈసారి గోరఖ్ పూర్ అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగాలని తీసుకున్న నిర్ణయంతో అఖిలేష్ యాదవ్ కూడా అసెంబ్లీ బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు యోగీ.. ఎమ్మెల్సీగానే కొనసాగుతారని భావించినా... ఆయనకు బీజేపీ గోరఖ్ పూర్ నుంచి బరిలోకి దింపుతోంది. దీంతో ప్రస్తుతం ఆజంగఢ్ నుంచి ఎంపీగా ఉన్న అఖిలేష్ కూడా తన పార్లమెంటు సీటు పరిధిలోకి వచ్చే గోపాల్ పూర్ సీటు నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తూర్పు యూపీలో ఉన్న గోరఖ్ పూర్ సీటు నుంచి యోగీ ఆదిత్యనాథ్ బరిలోకి దిగుతుండటం వల్ల ఆ ప్రాంతంలో బీజేపీ అవకాశాలు మెరుగుపడతాయనే అంచనాలున్నాయి. దీంతో తాను కూడా ఆజంగఢ్ పరిధిలోని గోపాల్ పూర్ నుంచి బరిలోకి దిగితే బావుంటుందని అఖిలేష్ భావిస్తున్నారు. దీనిపై త్వరలో ఆయన కీలక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
Recommended Video
ఎన్నికల ప్రచారం ప్రారంభించే నాటికి ఉన్న పరిస్ధితులతో పోలిస్తే ఇప్పుడు ఎస్పీకి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయని భావిస్తున్న అఖిలేష్... గోపాల్ పూర్ నుంచి తాను బరిలోకి దిగితే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉన్నారన్న ప్రచారం కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications