ఏఎంయూపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!
Supreme Court: అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీకి మైనారిటీ హోదా ఇచ్చే అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై దాఖలైన పిటీషన్లపై విచారణను రెగ్యులర్ బెంచ్‌కు రెఫర్ చేసింది. ప్రస్తుతం ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిధిలో దీని విచారణ కొనసాగుతోంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో ఏర్పాటైన ఈ ధర్మాసనంలో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఉన్నారు.

తొలుత 4:3 తేడాతో అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీకి మైనారిటీ హోదా ఇవ్వాలని తీర్మానించింది. డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ సంజీవ్ ఖన్నా అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీకి మైనారిటీ హోదా ఇవ్వడానికి సానుకూల నిర్ణయం తీసుకోగా మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వ్యతిరేకించారు.
దీనితో ఈ పిటీషన్లపై విచారణను రెగ్యులర్ బెంచ్‌కు రెఫర్ చేశారు సీజేఐ డీవై చంద్రచూడ్. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ విద్యాసంస్థ కాదంటూ 2006లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌పై ఏడు మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘకాలం పాటు విచారణ కొనసాగించిన విషయం తెలిసిందే.
2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ దీన్ని లార్జర్ బెంచ్ అంటే ఏడుమంది జడ్జీలతో కూడిన ధర్మాసనానికి రెఫర్ చేశారు. అలీగఢ్ యూనివర్శిటీ తరఫున సీనియర్ అడ్వొకేట్లు డాక్టర్ రాజీవ్ ధావన్, కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, షాదన్ ఫరాసత్ తమ వాదనలను వినిపించారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రాతినిధ్యం వహించారు. నీరజ్ కిషన్ కౌల్, గురు కృష్ణ కుమార్, వినయ్ నవరే, యతీందర్ సింగ్, విక్రమ్‌జిత్ బెనర్జీ, కేఎమ్ నటరాజ్ సహా పలువురు సీనియర్ న్యాయవాదులు కూడా ప్రతివాదులు తమ వాదనలు వినిపించారు.
ఈ వాదనలను విన్న అనంతరం బెంచ్ తన తుది తీర్పును వినిపించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ద్వారా అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీకి మైనారిటీ హోదా ఇచ్చినట్లు వెల్లడించింది. ఒక మతానికి చెందిన వ్యక్తులు ఏదైనా విద్యాసంస్థను నెలకొల్పితే దాన్ని ఆ మతానికి చెందినవారిదేగా పరిగణించలేమని అభిప్రాయపడింది.
ఒక యూనివర్శిటీ లేదా విద్యాసంస్థను మైనారిటీ ఇన్‌స్టిట్యూట్‌గా పరిగణించడానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఒక మతానికి చెందిన వ్యక్తులు నెలకొల్పిన విద్యాసంస్థను మైనారిటీ హోదా ఇవ్వడం సబబేనా?, మతం లేదా భాషాపరమైన మైనారిటీకి చెందిన వ్యక్తులు దాన్ని నిర్వహిస్తున్నారా? అనే అంశాలను ప్రాతిపదికన తీసుకుంది ఈ బెంచ్.
1875లో సయ్యద్ అహ్మద్ ఖాన్.. అలీగఢ్‌లో ఈ యూనివర్శిటీని స్థాపించారు. మొదట్లో మహ్మదీయన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజీగా ఇది కొనసాగింది. ఆ తరువాత అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీగా ఆవిర్భవించింది. ఇందులో కొన్ని కోర్సుల్లో ముస్లింలకు మాత్రమే ప్రవేశం ఉంది.












Click it and Unblock the Notifications