జ్ఞానవాపి మసీదు: ఆ శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలంటూ హైకోర్టు కీలక తీర్పు
లక్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో కనుగొనబడిన 'శివ్‌లింగం'కు కార్బన్ డేటింగ్ నిర్వహించడానికి అలహాబాద్ హైకోర్టు శుక్రవారం పురావస్తు శాఖ (ASIకు అనుమతినిచ్చింది. అయితే శివలింగం నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకూడదని కోర్టు స్పష్టం చేసింది.
హిందూ పక్షం ప్రశ్నార్థకమైన నిర్మాణాన్ని 'శివలింగం' అని పిలుస్తుండగా.. ముస్లిం పక్షం ఈ వస్తువు 'వజూఖానా' రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని పేర్కొంది. ఈ క్రమంలో ఇక్కడి శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షం తరపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది.

అయితే, మే 16, 2022న జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో కనుగొనబడిన శివలింగం లాంటి నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ ఆరాధకుల అభ్యర్థనను వారణాసి కోర్టు గత సంవత్సరం తిరస్కరించింది. తాజాగా, అలహాబాద్ హైకోర్టు కార్బన్ డేటింగ్‌కు అంగీకరించింది.
జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ్ ఆలయ కాంప్లెక్స్‌లో భాగమేనని.. ఆ మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే, దీన్ని మసీదు కమిటీ వ్యతిరేకించింది.
ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదు విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. అయితే, గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని కోర్టు తీర్పు చెప్పింది.












Click it and Unblock the Notifications