అమిత్ షాపై ఆరోపణలు: కెనడా హైకమిషనర్‌కు సమన్లు, తీవ్ర నిరసన
భారత్‌తో దౌత్య సంబంధాలు మరింత దిగజారేలా కెనడా వ్యవహారం కొనసాగుతోంది. ఆ దేశ మంత్రి ఒకరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అసంబంధ ఆరోపణలు చేశారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అంతేగాక, కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరులపై దాడుల వెనుక భారత పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి ఒకరు ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన అమిత్ షా పేరును ప్రస్తావించడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవి అసంబద్ధమైనవని, నిరాధారమైనవని భారత్ కొట్టిపారేసింది. ఈ వ్యవహారంలో కెనడా అధికారికి సమన్లు జారీ చేశామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. ఇటీవల ఒట్టావాలో పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కెనడా డిప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, వాటిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు.

అలాంటి బాధ్యతారహితమైన ప్రవర్తన దౌత్యపరమైన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. మరోవైపు, మోరిసన్ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఆ ఆరోపణలు ఆందోళనకరమని, దీనిపై తాము కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది.
కాగా, ఖలిస్థానీ సానుభూతిపరుడు నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీల నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్య వేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.












Click it and Unblock the Notifications