రేపిస్టుల మగతనం తీసేయాలి: కోర్టు సంచలన వ్యాఖ్య
చెన్నై: అత్యాచారాలకు పాల్పడేవారికి మగతనం లేకుండా చేయాలని, వారి విత్తు కొట్టాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎన్. కృపాకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రానికి సూచించారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు ఎలాంటి ప్రభావం చూపించడం లేదని, అరాచకమైనా, అత్యాచారం వంటి నేరాలకు అటువంటి శిక్షలే విధించాలని ఆయన అన్నారు.
గడచిన ఏడేళ్లలో చిన్నారులపై జరిగిన అత్యాచారాల్లో కేవలం 2.4 శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయని, ఇదేసమయంలో కేసుల సంఖ్య 400 శాతం పెరిగిందని గుర్తు చేసుకున్నారు. అమెరికాలో అత్యాచారాలకు పాల్పడిన వారిని నపుంసకులుగా మార్చే శిక్షలు ఉన్నాయని, అందుకే అక్కడ ఇటువంటి నేరాలు తగ్గాయని తెలిపారు.

మద్రాస్ హైకోర్టులో దాఖలైన ఓ పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి తన తీర్పులో ఆ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారానికి గురయ్యే అనేక బాలికల్లో అనేక మంది పోలీస్ స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేయడం లేదన్నారు. దీనికితోడు చట్ట సవరణలు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడేవారికి సెక్స్ సామర్థ్యం లేకుండా చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
ఈ తరహా విధానం రష్యా, పోలాండ్, దక్షిణ కొరియా దేశాలతో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉందని న్యాయమూర్తి గుర్తు చేశారు. వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకోవాలన్నారు. ముఖ్యంగా, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి శృంగార సామర్థ్యాన్ని తగ్గించే అంశం (విత్తుకొట్టడం)పై కేంద్రం పరిశీలించాలని సూచించారు. అలాగే, పాఠశాలల్లో సెక్స్ విద్యను ప్రవేశపెట్టే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని న్యాయమూర్తి కృపాకరన్ సూచించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారులపై కిరాతకమైన సామూహిక అత్యాచారాల పట్ల కోర్టు చలనరహితంగా ఉండలేదని, ప్రేక్షక పాత్ర వహించలేదని ఆయన అన్నారు. రేపిస్టులకు మగతనం లేకుండా చేసే శిక్షను విధిస్తే ఫలితాలు ఉంటాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications