బహిరంగంగా ఉరి... అలాగే మూడు రోజులు
ఆయుధాలు పట్టుకోలేదు.. ప్రజల్ని భావోద్వేగానికి గురిచేసే ప్రసంగాలు చేయలేదు.. ఎవరినీ ఏనాడూ పల్లెత్తు మాట అని ఎరగరు. కానీ ముఖ్యమైన సమయంలో తమ ప్రతర్థికి గుప్తంగా సాయం చేశాడని ఆంగ్లేయులు బహిరంగంగా ఉరితీశారు. స్వాతంత్య్ర భారతావని కోసం మౌన పోరాటం చేసి ప్రాణాలర్పించిన మహావీరుడు అమర్‌చంద్ బాంతియా!
అమర్ చంద్. 1793లో రాజస్థాన్‌లోని బికనీర్ లో వ్యాపార కుటుంబంలో జన్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆయన కుటుంబం గ్వాలియర్‌కు వచ్చి స్థిరపడింది. గ్వాలియర్ మహారాజు వీరికి ఆశ్రయం ఇవ్వడంతోపాటు వ్యాపారం చేసుకోవడానికి సాయం చేశారు. ఆ సమయానికి ఈస్టిండియా కంపెనీ పాలనపై భారతీయుల్లో రోజురోజుకు అసహనం పెరుగుతోంది. అమర్‌చంద్ స్నేహితులు కూడా కొందరు ఇంగ్లీషువారిపై పోరుబాట పట్టారు. ఒక్కొక్కరు ఒక్కోమార్గంలో పయనించారు. కొందరు సాయుధమార్గం ఎంచుకొని అమర్‌చంద్‌ను కూడా ఆహ్వానించారు. అయితే తను వారి ఆవేశానికి లొంగలేదు. సమయం వచ్చినప్పుడు పోరాటం చేస్తానని స్పష్టంగా చెప్పారు.

వ్యాపారంలో అమర్‌చంద్ పనితీరు చూసిన గ్వాలియర్ మహారాజా జయాజీరావు సింధియా ముచ్చటపడ్డారు. ఏకంగా తన సంస్థానంలో కొలువిచ్చారు. కొద్దికాలానికే అమర్ ఆయనకు నమ్మినబంటయ్యాడు. ఆయన నిబద్ధత, నిజాయతీ, మంచితనంపై మహారాజుకు గురి కుదిరింది. ఏకంగా తన సంస్థాన కోశాధికారిగా నియమింపచేశారు. గ్వాలియర్ కోశాధికారి అంటే ఆరోజుల్లో సాధారణ విషయం కాదు. గ్వాలియర్ కోటలో రహస్య అరల్లో చాలా సొమ్ము దాచి ఉంచేవారని ప్రచారంలో ఉంది. ఆ గుప్త నిధుల సమాచారం మహారాజుతో పాటు ఆయనకు అత్యంత విశ్వాసపాత్రులైన ఒకరిద్దరికి మాత్రమే తెలుస్తుంది.
గ్వాలియర్ సంస్థానంలో కీలక పదవిలో కొనసాగుతున్న సమయంలో తన స్నేహితులకు చిన్నప్పుడు మాటిచ్చిన 'సమయం' అనుకోకుండా అమర్‌చంద్ ముందుకొచ్చింది. ఆంగ్లేయులపై తిరుగుబాటు మొదలెట్టిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి... బ్రిటిష్‌కు మద్దతిస్తున్న సంస్థానాలపై కూడా దాడి చేశారు. గ్వాలియర్‌ను ఆమె స్వాధీనపరుచుకోగా మహారాజు జయాజీరావు కొద్దిరోజులు పారిపోయారు.

గ్వాలియర్ కోట ఝాన్సీ సేనల వశమైంది. ఆ సమయానికి ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యం పరిస్థితి అసలు బాగోలేదు. కొద్దిరోజుల నుంచి సైనికులకు జీతాలు చెల్లించలేదు. నిత్యావసరాలు కూడా నిండుకున్నాయి. ఆమెను, ఆమె సైన్యాన్ని నిర్వీర్యం చేయటం కోసం వారికందుతున్న సాయాన్ని అన్నివైపుల నుంచీ బ్రిటీష్ వారు నరుక్కుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్వాలియర్ కోశాధికారి అమర్‌చంద్... మొదటి స్వాతంత్య్ర సంగ్రామం నీరుగారిపోకూడదనే ఉద్దేశంతో గ్వాలియర్ మహారాజు తనకప్పగించిన ఒక గుప్త నిధి అరను రాణి లక్ష్మీబాయికి అప్పగించారు.
ఆ నిధుల కారణంగా లక్ష్మీబాయి సైన్యం తన పోరాటాన్ని మరి కొంతకాలం కొనసాగించగలిగింది. ఇది ఎలా సాధ్యపడిందో బ్రిటీషర్లకు అర్థం కాలేదు. ఆమెను మట్టుబెట్టిన తర్వాత గ్వాలియర్‌లో ఏం జరిగిందనే దానిపై అన్వేషించారు. తర్వాత అమర్‌చంద్‌ను పట్టుకున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి మరణించిన నాలుగు రోజులకే... ఆయన్ను రాజద్రోహం కింద విచారించి ఉరిశిక్ష విధించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఎవరైనా సరే స్వాతంత్ర్య సమర యోధులకు సాయం చెయ్యాలంటే భయపడాలి అనే ఉద్దేశంతో గ్వాలియర్‌లోని నడివీధిలో అమర్‌చంద్‌ను చెట్టుకు ఉరితీశారు. ఉరి తీసిన తర్వాత కూడా మూడురోజులపాటు అలాగే వేలాడదీశారు. గ్వాలియర్‌లోని బులియన్ మార్కెట్‌లో అదే చెట్టుకింద ఆయన స్మారక విగ్రహం ఇప్పుడు ఉంది.

గ్వాలియర్ గుప్త నిధులపై కన్నేసిన బ్రిటీషర్లు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని అణచివేసిన తర్వాత కోటను తమ వద్దే ఉంచుకున్నారు కానీ నిధులు ఎక్కడున్నాయనే విషయాన్ని మాత్రం కనుక్కోలేకపోయారు. చివరకు సంస్థానాన్ని 1886లో మహారాజు జయాజీరావు సింధియాకు అప్పగించారు. గుప్తనిధుల రహస్య కోడ్ తన వారసులకు చెప్పకుండానే ఆయన మరణించారు. తర్వాత ఆయన వారసుడు మాధోరావు సింధియా (రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సింధియా తాత)తో పాటు ఇంగ్లీషు వారు కూడా ఈ నిధుల కోసం ప్రయత్నించారు. 1889లో గ్వాలియర్ రెసిడెంట్ కర్నల్ బనెర్మన్ సారథ్యంలో పలుచోట్ల తవ్వకాలు జరిపారు. మోతీమహల్ ప్యాలెస్‌లో ఒక ఛాంబర్ బయటపడింది. ఆ కాలంలోనే రూ.6 కోట్ల నగదు, 150 కిలోల బంగారం దొరకగా.. వజ్రవైఢూర్యాలు, వెండిని లెక్కపెట్టలేకపోయారంటే ఎంత సంపద దాచివుంచారో అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications