101 శాతం పక్కా.. తమ కూటమిదే విజయం, బీజేపీతో కలిసి బరిలోకి: అమరీందర్ సింగ్
పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. బీజేపీతో కలిసి పోటీ చేస్తామని మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ చెబుతోన్న సంగతి తెలిసిందే. ఇవాళ దానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ధృవీకరిస్తూ మరో ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ- పీఎల్సీ కలిసి ఎన్నికల బరిలోకి దిగనున్నాయి.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కలిసి పోటీ చేయడం ఖరారు అయ్యింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్‌తో ఢిల్లీ భేటీ అయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటును చేపడతాయని అమరీందర్ ట్వీట్ చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 101 శాతం తాము విజయం సాధిస్తామని కెప్టెన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

అమరీందర్ సింగ్‌తో భేటీ తర్వాత కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఓ ట్వీట్ చేశారు. ఏడు రౌండ్ల చర్చల తర్వాత తమ పొత్తు ఖాయం అయ్యిందని ఆయన చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయని స్పష్టం చేశారు. సీట్ల పంపిణీ ఇంకా జరగలేదని.. అయినప్పటికీ ఇరు పార్టీలు కలిసి పోటీ చేయడం పక్కా అని షెకావత్ తెలిపారు.
సీట్ల పంపకం అనేది విజయాన్ని బట్టి ఉంటుందని అమరీందర్ సింగ్ తెలియజేశారు. తమ కూటమి విజయం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడకముందే అమరీందర్ సింగ్ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. 40 ఏళ్ల పాటు కలిసి పనిచేసిన పార్టీని చివరికీ వీడారు. ఆ తర్వాత కేంద్రమంత్రి, పంజాబ్ బీజేపీ ఇంచార్జీ షెకావత్ కూడా స్పందించారు. తమతో కలిసి మాజీ అకాళీదల్ నేత సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా కూడా కలుస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications