వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబేడ్కర్: భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు బాటలు వేసిన ఆర్థికవేత్త

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
దిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం

విద్యార్థి ద‌శ‌లో, కేవ‌లం 32 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ రాసిన ఓ పుస్త‌కం భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మూల స్తంభంగా నిలిచింది. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో డాక్ట‌రేట్ డిగ్రీ కోసం ఆయ‌న చేసిన ప‌రిశోధ‌నే ఈ పుస్త‌క రూపంలో ఆవిష్కృత‌మ‌యింది.

ఆ ప‌రిశోధ‌న సారాంశం ఆధారంగా రాసి 1923లో లండ‌న్‌లో వెలువ‌రించిన "ద ప్రాబ్ల‌మ్ ఆఫ్ రూపీ'' పుస్త‌కం భార‌త‌, బ్రిటిష్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల బ‌లపడడానికి స‌హ‌క‌రించింది. దీనిపై జ‌రిగిన చ‌ర్చ‌లు అనంత‌ర కాలంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు బాటలు పరిచాయి.

భార‌త రాజ్యాంగ నిర్మాత‌గా అంబేడ్క‌ర్ అంద‌రికీ తెలుసు. భార‌త స‌మాజంలోని కులవ్య‌వ‌స్థ కారణంగా శ‌తాబ్దాలపాటు అణ‌గారిన ద‌ళిత వ‌ర్గాల్లో చైత‌న్యం నింపిన నాయకునిగానూ ఆయన ప‌రిచ‌య‌మే. ఇంత‌టి విప్ల‌వాన్ని ఒంటి చేత్తో న‌డిపించినందుకు ఆయ‌న‌ను "మ‌హా మాన‌వ్‌ '' అని ప్ర‌జానీకం ఆప్యాయంగా పిలుచుకుంటుంది.

అంబేడ్కర్ వ్య‌క్తిత్వం విశ్య‌వ్యాపితం. మతం, మాన‌వ వికాసం, సామాజిక శాస్త్రాలు, రాజ‌నీతి శాస్త్రం.. ఇలా అన్నింటిలోనూ ఆయ‌న మేధాశ‌క్తి అపార‌మైన‌ది. అయితే ఆయ‌న ర‌చ‌న‌లు, ప్ర‌సంగాల‌ను ప‌రిశీలిస్తే ఆయ‌న హృద‌యానికి, ఆలోచ‌న‌ల‌కు ద‌గ్గ‌రగా ఉన్నది ఆర్థిక శాస్త్రం మాత్ర‌మేనని అర్ధమవుతుంది.

రాజ్యాంగ నిర్మాత‌, కుల వ్య‌వ‌స్థ వ్య‌తిరేక పోరాట యోధుడు అని చెప్పిన త‌రువాత మాత్ర‌మే అంబేడ్క‌ర్‌ను ఆర్థికవేత్త అని ప్ర‌స్తావిస్తుంటారు. కానీ, ఆర్థిక సిద్ధాంతాలే, ద‌శాబ్దాల పాటు కొన‌సాగిన ఆయ‌న రాజ‌కీయ జీవితంపై ఎక్కువ ప్ర‌భావం చూపాయి. ఆయ‌న ఆలోచ‌న‌లు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేశాయి.

మ‌రీ ముఖ్యంగా దేశంలో అన్ని ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి ఓ కేంద్రీయ బ్యాంకు ఉండాల‌న్న ప్ర‌తిపాద‌న‌కు అంబేడ్కర్ ఆలోచ‌న‌లు, ప‌రిశోధ‌న‌లే మార్గ‌ద‌ర్శ‌నం చేశాయి. అయితే ఆయ‌న ప‌డ్డ ఈ శ్రమ‌కు, ఆలోచన‌ల‌కు ఇంత‌వ‌ర‌కు అంత‌గా గుర్తింపు ల‌భించ‌లేదు.

భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు ఏర్పాటుకు బ్రిటిషు పాల‌న‌లోనే పెద్ద స్థాయిలో మేధామథనం జ‌రిగింది. ఈ ప్ర‌క్రియ‌లో అంబేడ్క‌ర్‌ది క్రియాశీల పాత్ర‌. భార‌తీయ క‌రెన్సీపై ఆయ‌న‌ చేసిన సైద్ధాంతిక‌, ఆచ‌ర‌ణాత్మ‌క విశ్లేష‌ణ రిజర్వు బ్యాంకు స్థాప‌న‌లో నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించిన‌ట్టు ఆర్థిక శాస్త్రవేత్త‌లు విశ్వ‌సిస్తున్నారు.

ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ పుస్తకం ముఖచిత్రం

1773-1935: కేంద్రీయ బ్యాంకు ఏర్పాటు ప‌రిణామ క్ర‌మం

భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు 1935 ఏప్రిల్ 1న ఏర్పాట‌యింది. ఇది విదేశీ క‌రెన్సీతోపాటు దేశంలోని క‌రెన్సీ నిల్వ‌లు, నియంత్ర‌ణ‌, అందుకు సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను చూస్తుంది. దేశంలోని మొత్తం అన్ని బ్యాంకుల‌కు అది బ్యాంకుగా ప‌ని చేస్తుంది. దీని ఏర్పాటు వెనుక ఉన్న చ‌రిత్ర చాలా సుదీర్ఘ‌మైన‌దే. తెలుసుకోవాలంటే ఆంగ్లేయుల పాల‌న కాలం నాటికి వెళ్లాల్సిందే..

ఈస్ట్ ఇండియా కంపెనీ వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి బ్రిటిషు ప్ర‌భుత్వ ప్ర‌త్య‌క్ష పాల‌న మొద‌ల‌య్యే వ‌ర‌కు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా మార్పుల‌కు లోన‌యింది. ఇందులో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఏర్పాటు చాలా కీల‌క‌మైన‌ది. ఓ క్ర‌మ ప‌రిణామంలో ఫార్మ‌ల్ బ్యాంకింగ్ రంగం వేళ్లూనుకుంది. ఈ ప్ర‌యాణంలో ఎదురైన మ‌లుపులను రాహుల్ బ‌జోరియా తాను రాసిన "ద స్టోరీ ఆఫ్ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా''లో వివరంగా రాశారు.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ ద్వారా దేశంలో బ్రిటిషు సామ్రాజ్యానికి పునాది వేసిన తొలిత‌రం పాల‌కుల్లో వారెన్ హేస్టింగ్స్ ప్ర‌ముఖుడు. కంపెనీ లావాదేవీలు న‌డ‌ప‌డానికి బ్యాంకు ఉండాల్సిన అవ‌స‌రాన్ని తొలిసారిగా గుర్తించింది ఆయ‌నే. "జ‌న‌ర‌ల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బిహార్ '' ఏర్పాటు చేయాల‌ని 1773లో ఆయ‌న ప్ర‌తిపాదించారు. అయితే అది తిర‌స్కర‌ణ‌కు గుర‌యింది.

ఆ త‌రువాత రోజుల్లో కంపెనీ ప‌రిధిలోకి వ‌చ్చిన ప్రాంతాలు పెర‌గ‌డంతో అనుమ‌తి ల‌భించింది. ఆ మేర‌కు 1806లో "బ్యాంక్ ఆఫ్ బెంగాల్ '' ఏర్పాటైంది. బెంగాల్‌, బిహార్‌లలో సొంతంగా క‌రెన్సీ నోట్ల‌ను ముద్రించి, చ‌లామ‌ణిలోకి తెచ్చే అధికారం కూడా ఆ బ్యాంకుకు ఇచ్చారు.

దేశంలో బ్రిటిష్ పాల‌న కింద‌కు మ‌రిన్ని ప్రాంతాలు రావ‌డంతో కొత్త‌గా ఇంకొన్ని బ్యాంకులు ఏర్పాట‌య్యాయి. 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబే, 1843లో బ్యాంక్ ఆఫ్ మ‌ద్రాస్ ల స్థాప‌న జ‌రిగింది. మొత్తంగా ఈ మూడు బ్యాంకుల‌ను ప్రెసిడెన్సీ బ్యాంకులు అని పిలిచేవారు. ఆయా ప్రావిన్స్‌ల్లోని వ్య‌వ‌హారాల‌ను ఇవి ప‌ర్య‌వేక్షించేవి.

1857లో సిపాయిల తిరుగుబాటు అనంత‌రం దేశ ప‌రిపాల‌న ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం చేతిలోకి వెళ్లింది. దీంతో క్ర‌మ‌బ‌ద్ధ బ్యాంకింగ్ రంగాన్ని విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

1861లో బ్రిటిష్ ప్ర‌భుత్వం పేప‌ర్ క‌రెన్సీ యాక్ట్‌ను ఆమోదించి క‌రెన్సీకి చెందిన అన్ని అంశాల‌నూ త‌న అధీనంలోకి తెచ్చుకొంది. ఈ దృష్ట్యా దేశంలోని అన్ని ఆర్థిక‌ వ్య‌వ‌హారాల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డానికి ఓ కేంద్రీయ బ్యాంకును ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆ స‌మ‌యంలోనే కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు.

క‌రెన్సీ మార‌కం విలువలో వ‌చ్చిన ఒడిదుడుకులు కూడా సెంట్ర‌ల్ బ్యాంకు ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను పురిగొల్పాయి. ఆ రోజుల్లో ఇండియ‌న్ క‌రెన్సీ విలువ‌ను వెండి ధ‌ర‌ను ఆధారంగా చేసుకొని లెక్కించే వారు. అంటే సిల్వ‌ర్ స్టాండ‌ర్డ్‌ విధానాన్ని అనుస‌రించేవారు. 1892లో బంగారంతో పోల్చితే వెండి ధ‌ర‌లు బాగా ప‌డిపోవ‌డంతో క‌రెన్సీ మార‌కం విలువ‌పై స‌మీక్ష చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

దాంతో ఇండియ‌న్ క‌రెన్సీపై ఏర్పాట‌యిన రివ్యూ క‌మిటీ.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ త‌ర‌హాలో కేంద్రీయ బ్యాంకు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రముంద‌ని సూచించింది. కానీ వివిధ ర‌కాల వాణిజ్య ప్ర‌యోజ‌నాల దృష్ట్యా దీన్ని ప‌క్క‌న‌పెట్టేశారు. ఈ దిశ‌గా చాలా కాలం పాటు ఎలాంటి అడుగూ ప‌డ‌లేదు.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ భవనం

అనంత‌రం దేశంలోని ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను ప‌రిశీలించ‌డానికి రాయ‌ల్ క‌మిష‌న్ ఆన్ ఇండియ‌న్ ఫైనాన్స్ అండ్ క‌రెన్సీ ఏర్పాట‌యింది. దీన్నే ఛాంబ‌ర్లిన్ క‌మిష‌న్ అని పిలిచేవారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌కు చెందిన విఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ (జేఎం కీన్స్) 1913లో ఈ క‌మిష‌న్ స‌భ్యుడ‌య్యారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ, క‌రెన్సీపై లోతుగా అధ్య‌య‌నం చేసిన నిపుణుడాయ‌న‌.

రూపాయి విష‌యానికి వ‌స్తే.. ఉప‌ ఖండం క‌రెన్సీగా రూపాయి స్థిర‌ప‌డే వ‌రకు అన్ని ప్రాంతాల్లోనూ ఇత‌ర క‌రెన్సీతోపాటు దాన్ని కూడా స్థానిక క‌రెన్సీగా గుర్తించే వారు. 1910లో ప్ర‌భుత్వం యూనివ‌ర్స‌ల్ పేప‌ర్ క‌రెన్సీ యాక్ట్‌ను తీసుకువ‌చ్చింది. దాని ఆధారంగా 5, 10, 100 నోట్ల‌ను చ‌లామ‌ణిలోకి తెచ్చింది.

వీట‌న్నింటినీ ప‌రిశీలించిన ఛాంబ‌ర్లిన్ క‌మిష‌న్, 1914లో నివేదిక స‌మ‌ర్పించింది. మూడు ప్రెసిడెన్సీ బ్యాంకుల‌ను విలీనం చేసి కేంద్రీయ బ్యాంకు ఏర్పాటు చేయాల‌ని సిఫార్సు చేసింది. దానిపై ప్ర‌భుత్వ నియంత్ర‌ణ ఉండాల‌ని కూడా సూచించింది. ప్ర‌భుత్వ ఆదాయాలు, అప్పులు, క‌రెన్సీ ముద్ర‌ణ‌, నియంత్ర‌ణ అన్ని బాధ్య‌త‌ల‌ను కూడా ఆ బ్యాంకుకు అప్ప‌గించాల‌ని స‌ల‌హా ఇచ్చింది.

మొద‌టి ప్ర‌పంచ యుద్ధం అనంత‌రం 1921లో బ్రిటిషు ప్ర‌భుత్వం మూడు ప్రెసిడెన్షియ‌ల్ బ్యాంకుల‌ను విలీనం చేసి ఇంపీరియ‌ల్ బ్యాంకుకు రూప‌క‌ల్ప‌న చేసింది. అయితే క‌రెన్సీ నోట్ల‌పై ఎలాంటి హ‌క్కుల‌నూ ఈ బ్యాంకుకు క‌ల్పించ‌లేదు. అనంత‌ర కాలంలో అంటే 1955లో ఈ బ్యాంకునే భార‌త ప్ర‌భుత్వం జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చ‌డం గ‌మ‌నార్హం.

ఈ స‌మ‌యంలోనే రూపాయి మార‌కం విలువ తీవ్ర‌మైన ఆటుపోట్ల‌కు లోనైంది. యుద్ధం కార‌ణంగా 1917లో ప్ర‌భుత్వం బంగారం అమ్మ‌కాల‌పై నిషేధం విధించ‌డంతో వెండి ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి. దాంతో రూపాయికి ఎన్నో స‌వాళ్లు ఎదుర‌య్యాయి. పౌండ్ స్టెర్లింగ్‌తో పోల్చిన‌ప్ప‌డు రూపాయి మార‌కం విలువ‌ను స్థిరంగా ఉంచాల‌న్న డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే ఏవీ ఆచ‌ర‌ణ‌లోకి రాలేదు.

ఈ నేప‌థ్యంలో భార‌త క‌రెన్సీలో తీసుకురావాల్సిన సంస్క‌ర‌ణ‌ల‌పై అధ్య‌య‌నం చేయ‌డానికి హిల్ట‌న్ యంగ్ క‌మిష‌న్‌ను బ్రిటిష్ ప్ర‌భుత్వం నియ‌మించింది. రిజ‌ర్వు బ్యాంకు ఏర్పాటులో ఇదే కీల‌క అడుగు.

స‌రిగ్గా ఇదే ద‌శ‌లో అంబేడ్క‌ర్ రంగంలోకి దిగారు. హిల్ట‌న్ యంగ్ క‌మిష‌న్ స‌భ్యులంద‌రి చేతుల్లో అంబేడ్క‌ర్ రాసిన ద ప్రాబ్లం ఆఫ్ రూపీ పుస్త‌కం క‌నిపించింది. వారికి అది క‌ర‌దీపిక‌లా మారింది.

విద్యార్ధిగా అంబేడ్కర్

రూపాయిని కాపాడిన ఆర్థికవేత్త అంబేడ్క‌ర్‌

విద్యార్థి ద‌శ నుంచే అంబేడ్క‌ర్‌కు ఆర్థిక రంగంపై ఆస‌క్తి ఉండేది. దేశ చ‌రిత్ర‌-వ‌ర్త‌మానం-భ‌విష్య‌త్తు చుట్టూ ఆయ‌న ఆలోచ‌న‌లు తిరుగుతుండేవి. 1913లో న్యూయార్క్‌లోని కొలంబియా యూనివ‌ర్సిటీలో చేరారు. అక్క‌డి ఎక‌నామిక్స్ ప్రొఫెస‌ర్ ఎడ్విన్ సెలిగ్నాం స్ఫూర్తితో ఎం.ఎ.ఆర్థిక శాస్త్రంలో చేరారు.

ఎం.ఎ.లో అడ్మినిస్ట్రేష‌న్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ అనే అంశంపై అంబేడ్కర్ థీసిస్ రాశారు. 1792 నుంచి 1958 వ‌ర‌కు అంటే దేశంలో ఆ కంపెనీ బాగా విస్త‌రించిన స‌మ‌యంలో జ‌రిగిన‌ ఆర్థిక కార్య‌క‌లాపాల‌పై అధ్య‌య‌నం చేశారు. దేశంలోని పాల‌నా రంగం, ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై అది ఏ విధంగా ప్ర‌భావం చూపిందో విశ్లేషించారు. ప్ర‌జ‌ల‌ను దోపిడీ చేసిన తీరునూ ధైర్యంగా వివ‌రించి చెప్పారు.

ఒక‌వైపు సౌక‌ర్యాలు మెరుగుపడి జీవన‌ శైలిలో మార్పులు కనిపిస్తున్నాయ‌ని, మ‌రోవైపు భార‌తీయులు ఆర్థిక బానిస‌లుగా మారార‌ని త‌న ప‌రిశోధ‌న వ్యాసంలో కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు అంబేడ్కర్.

అనంత‌రం లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో అంబేడ్కర్ రీసెర్చ్ నిమిత్తం చేరారు. ఆ స‌మ‌యంలో ఇంగ్లాండ్‌లోను, ఇండియాలోను రూపాయి మార‌కం విలువ‌పైనే చ‌ర్చ‌లు జ‌రుగుతుండేవి.

రూపాయి విలువ త‌ర‌చూ ప‌డిపోతుండ‌డం, విలువ‌ను సుస్థిరంగా ఉంచ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ఇందుకు గోల్డ్ ఎక్స్ఛేంజ్ స్టాండ‌ర్డ్‌, గోల్డ్ క‌న్వ‌ర్ట‌బుల్ స్టాండ‌ర్డ్‌లో ఏది మంచిది, ఏ విధానాన్ని అనుస‌రించాలి, కేంద్రీయ బ్యాంకు ఏర్పాటు... త‌దిత‌ర అంశాలపై చర్చ‌లు న‌డుస్తుండేవి.

అందువ‌ల్ల పీహెచ్‌డీ ప‌రిశోధ‌న‌లో భాగంగా రూపాయి స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని నిర్ణయానికి వ‌చ్చారు అంబేడ్కర్. ఆ ప‌రిశోధ‌న‌ల ఫ‌లిత‌మే ద ప్రాబ్ల‌మ్స్ ఆఫ్ ద రూపీ.

అప్ప‌టికే భారతదేశ ఆర్థిక రంగంపై అధ్య‌య‌నం చేసిన ప్రొఫెస‌ర్ జేఎం కీన్స్ భార‌త్‌కు మేలైన క‌రెన్సీ విధానం ఏద‌నేదానిపై కొన్ని సూచ‌న‌లు చేశారు. కానీ వాట‌న్నంటినీ అంబేడ్క‌ర్ పూర్తిగా వ్య‌తిరేకించారు.

కీన్స్‌, అంబేడ్క‌ర్‌ వివాదాన్నిప్ర‌ముఖ ఆర్థిక వ్య‌వ‌హారాల నిపుణుడు, లోక్‌స‌త్తా సంపాద‌కుడు గిరీశ్ కుబేర్ అర్థశాస్త్రీ అంబేడ్క‌ర్‌ అన్న పేరుతో రాసిన వ్యాసంలో వివ‌రించారు.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అంబేడ్కర్

కుబేర్ త‌న వ్యాసంలో ఏం రాశారంటే...

"క‌రెన్సీ వ్య‌వ‌హారాల‌పై సాధికారికంగా చెప్పేవారిలో ప్ర‌పంచంలోనే ప్రొఫెస‌ర్ కీన్స్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంటారు. ఈ విష‌యాల్లో ఆయ‌న అభిప్రాయం తీసుకోకుండా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశ‌మే ఉండ‌దు. కానీ అంబేడ్క‌ర్ ఆయ‌న ఆలోచ‌నా విధానాల‌ను పూర్తిగా స‌వాలు చేశారు.

భార‌త క‌రెన్సీకి గోల్డ్ ఎక్స్ఛేంజ్ స్టాండ‌ర్డ్ విధానం స‌రైన‌ద‌ని కీన్స్ సిఫార్సు చేశారు. ఈ విధానం ప్ర‌కారం క‌రెన్సీని పౌండ్‌, డాల‌ర్ల రేట్ల‌తో స‌రిపోల్చుతారు. వాటిని కూడా బంగారంగానే ప‌రిగ‌ణిస్తారు. వాటితో రూపాయిని స‌రిపోల్చి విలువ‌ను నిర్ణ‌యిస్తారు. అదే గోల్డ్ క‌న్వ‌ర్ట‌బుల్ స్టాండ‌ర్డ్లో అయితే బంగారం నిల్వ‌లు, ధ‌ర‌కు అనుగుణంగానే రూపాయి విలువ ఉంటుంది.

భార‌త్ వ‌ల‌స దేశం కావ‌డంతో గోల్డ్ ఎక్స్ఛేంజ్ స్టాండ‌ర్డ్ విధానం స‌రిపోతుంద‌ని బ్రిటిష్ ప్రభుత్వం, కీన్స్ లాంటివారు భావించారు. దీన్ని అంబేడ్క‌ర్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. గోల్డ్ ఎక్స్ఛేంజ్ స్టాండ‌ర్డ్ విధానం వ‌ల్ల రూపాయి మార‌కం రేటులో స్థిర‌త్వం రాద‌ని ఆయన వాదించారు.

త‌న వాద‌న‌కు మ‌ద్ద‌తుగా 1800-1893 మ‌ధ్య ఉన్న‌ క‌రెన్సీ విలువ‌ల‌పై అధ్య‌య‌నం చేసి రూపాయి విలువ ఏ విధంగా మార్పుల‌కు లోన‌యిందో చూపించారు. వెనుకబ‌డిన దేశ‌మైన ఇండియాకు ఇది స‌రిపోద‌ని చెప్పారు. దీని వ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతుంద‌ని తెలిపారు.

అంబేడ్క‌ర్ అక్క‌డితోనే ఆగిపోలేదు. విస్తృతంగా అధ్య‌య‌నం చేయ‌డం ద్వారా బ్రిటిష్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌గ‌లిగారు. భార‌త్‌కు ఎగుమ‌తులు చేసే బ్రిటిష్ వ్యాపారుల‌కు అధికంగా లాభాలు వ‌చ్చేలా చేయ‌డానికే కావాల‌ని రూపాయి విలువ‌ను అధికంగా చేసి చూపిస్తున్నార‌ని, అందుకే గోల్డ్ ఎక్స్ఛేంజ్‌ స్టాండ‌ర్డ్ కావాల‌ని సిఫార్సు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అందువ‌ల్ల రూపాయి మార‌కం విలువను త‌గ్గించాల‌ని డిమాండు చేశారు కూడా.

అంబేడ్కర్

యంగ్ క‌మిష‌న్ ఎదుట అంబేడ్క‌ర్ 'టెస్టిమొనీ'

ఆర్థిక శాస్త్రంతో సంబంధం ఉన్న వారంతా అప్ప‌ట్లో అంబేడ్క‌ర్ పుస్త‌కంపై విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రిపేవారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే హిల్ట‌న్ యంగ్ ఆధ్వ‌ర్యంలో నియ‌మించిన రాయ‌ల్ క‌మిష‌న్ 1925లో భార‌త్‌కు వ‌చ్చింది. భార‌త క‌రెన్సీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేసి, ప్ర‌భుత్వానికి త‌గిన సిఫార్సులు చేయ‌డం దాని విధి.

ఈ క‌మిష‌న్ స‌భ్యుల్లోని ప్ర‌తి ఒక్క‌రూ అంబేడ్క‌ర్ థీసిస్‌ను చ‌దివారు. దాంతో క‌మిష‌న్ ఎదుట హాజ‌రై 'టెస్టిమొనీ' ఇవ్వాలని ఆయ‌న్ను కోరారు. త‌న పుస్త‌కం ఆధారంగా స‌మ‌స్య‌ల‌ను విశ్లేషించి, ప్రాక్టిక‌ల్‌గా అమ‌లు చేయ‌ద‌గ్గ చ‌ర్య‌ల‌ను సిఫార్సు చేశారు.

భార‌త్‌కు గోల్డ్ ఎక్స్ఛేంజ్‌ స్టాండ‌ర్డ్ విధానం కాకుండా గోల్డ్ క‌న్వ‌ర్టబుల్ స్టాండ‌ర్డ్‌ విధాన‌మే మేలైన‌ద‌ని వాదించారు. దాంతో మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌పై స‌భ్యులు ఆయ‌న అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. ఈ చ‌ర్చ‌ల‌న్నీ అనంత‌రం ప్ర‌చురిత‌మ‌య్యాయి.

కాలాతీతమైన సందేశం

సంక్షిష్ట‌మైన క‌రెన్సీ వ్య‌వహారాల‌పై త‌న అభిప్రాయాల‌ను చెప్ప‌డంతో పాటు, వీటి నియంత్ర‌ణ‌కు కేంద్రీకృత వ్య‌వ‌స్థ ఉండాల‌ని అంబేడ్కర్ నొక్కి చెప్పారు. ఆ విధంగా రిజ‌ర్వు బ్యాంకు ఏర్పాటులో ప్ర‌ముఖ పాత్ర పోషించారు.

"త‌న పుస్త‌కంలో అధిక భాగాన్ని రూపాయికి సుస్థిర‌మైన, హేతుబ‌ద్ధమైన అంతర్గత విలువను తీసుకురావడానికే కేటాయించారు. ఆ విలువ ఉంటేనే మ‌నీ సప్లై మీద నియంత్ర‌ణ ఉంటుంది. క‌రెన్సీని ఇష్యూ చేసే అధికారాన్ని ప్ర‌భుత్వం చేతుల నుంచి తీసుకోవ‌డం కూడా సాధ్య‌మ‌వుతుంది. ప్ర‌భుత్వం ఇష్టం వ‌చ్చిన రీతిలో క‌రెన్సీని విడుద‌ల చేస్తున్నందున దేశంలోని అంత‌ర్గ‌త వాణిజ్యం దెబ్బతింటోంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. కమిషన్‌లోని మ‌రికొంద‌రు సభ్యులు కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్య‌క్తం చేశారు. అప్ప‌టికే చాలా దేశాల్లో కేంద్రీయ బ్యాంకులు ఏర్పాటు కావ‌డంతో ఇండియాలోనూ అలాంటి దాన్ని ఏర్పాటు చేయాల‌నే సూచ‌న‌లు వ‌చ్చాయి. దాంతో 1926 జులైలో ఇచ్చిన కమిషన్ తుది నివేదిక‌లో కొత్త‌గా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయాల‌ని సిఫార్సు చేసింది. క‌రెన్సీ చ‌లామ‌ణి, ఎక్స్ఛేంజి రేటు నిర్వ‌హ‌ణ‌పై దానికి అధికారాలు ఉండాల‌ని, అది ప్ర‌భుత్వానికి బ్యాంకుగా ప‌నిచేయాల‌ని తెలిపింది" అని వివరించారు.

ఒక ఆర్థికవేత్త‌గా అంబేడ్క‌ర్ సేవ‌ల‌పై సీనియ‌ర్ ఆర్థిక శాస్త్రవేత్త‌, రాజ్య‌స‌భ సభ్యుడు డాక్ట‌ర్ న‌రేంద్ర జాద‌వ్.. ఎక‌నామిక్ అండ్ పొలిటిక‌ల్ వీక్లీలో వ్యాసం రాశారు. "భార‌త ఆర్థిక రంగం ఇప్ప‌డు సంపూర్ణంగా మారిపోయింది. కానీ అంబేడ్క‌ర్ ఇచ్చిన ప్ర‌ధాన సందేశం కాలానికి అతీతంగా నిలిచింది. క‌రెన్సీని విడుద‌ల చేయ‌డానికి విచ‌క్ష‌ణాధికారాలు ఉన్న వ్య‌వ‌స్థ‌ను నియంత్రించ‌డానికి ఓ ఏర్పాటు ఉండాల‌ని ఆయ‌న చెబుతుండేవారు. అది ఇప్ప‌టికీ వ‌ర్తిస్తుంది" అని ఆయన అందులో వ్యాఖ్యానించారు.

ప్ర‌పంచీక‌ర‌ణ‌తో అనుసంధాన‌మైన దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో రిజ‌ర్వ్ బ్యాంకు బాధ్య‌త‌ల‌ను ప‌రిశీలించినప్పుడు అంబేడ్క‌ర్ ఆలోచ‌న‌లు మార్గ‌ద‌ర్శ‌కాలుగా నిలుస్తాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు

యంగ్ క‌మిష‌న్ సిఫార్సుల మేర‌కు రిజ‌ర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయ‌డానికి నిర్ణ‌యించిన బ్రిటిష్ ప్ర‌భుత్వం 1927లో బిల్లు ప్ర‌వేశ‌పెట్టింది. ఆ సంస్థ‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి కల్పించింది. అటాన‌మీని కాపాడ‌డం కోసం మేనేజ్‌మెంట్ బాడీలో రాజ‌కీయ సంబంధాలు ఉన్న‌వారిని నియ‌మించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది.

అయితే ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతో బిల్లుకు వెంట‌నే ఆమోదం ల‌భించ లేదు. 1928లో దాన్ని రివైజ్ చేసి మ‌ళ్లీ పెట్టినా విభేదాలు మాత్రం తొల‌గ‌క‌పోవ‌డంతో అప్పుడు కూడా పాస్ కాలేదు.

1930లో జ‌రిగిన మొద‌టి రౌండ్ టేబుల్ కాన్ఫ‌రెన్స్‌లో మ‌రోసారి దీని ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. రాజ‌కీయ సంస్క‌ర‌ణ‌లు, హ‌క్కులు క‌ల్పించ‌డంతో పాటు, ఆర్థిక హ‌క్కుల‌కూ స‌మాన ప్రాధాన్యం ఇవ్వాల‌న్న డిమాండ్లు వ‌చ్చాయి. కేంద్రీయ బ్యాంకు ఏర్పాటు అవ‌స‌రాన్ని సమావేశంలో బలంగా చెప్పారు.

దాంతో 1933లో ఇంకోసారి రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. 1934 మార్చి 6న గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్ సంత‌కం చేయ‌డంతో అది చ‌ట్టరూపం దాల్చింది. ఆ మేరకు 1935 ఏప్రిల్ 1న రిజ‌ర్వ్ బ్యాంకు ఏర్పాట‌యింది.

ఈ స‌ర్వోన్న‌త బ్యాంకు ఏర్పాటు కాక‌ముందు భార‌త బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఎన్నో సంక్షోభాల‌ను ఎదుర్కొంది. వివిధ ద‌శ‌ల్లో అంబేడ్క‌ర్ తీసుకున్న వైఖ‌రి, చేసిన వాద‌న‌లు, ఆయ‌న ఆర్థిక విధానాలు వీట‌న్నింటినీ అధిగ‌మించేలా చేశాయి. త‌ద్వారా నేటికీ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌కు వెన్నుద‌న్నులా ఉన్న‌ రిజ‌ర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు స‌హ‌క‌రించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ambedkar: The economist who paved the way for the formation of the Reserve Bank of India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X