నెహ్రూ-లియాకత్ ఒప్పందం అమలుచేస్తామన్న అమిత్ షా.. అసలేంటీ ఒప్పందం.. ఎందుకు పదేపదే చెబుతున్నారు?
పౌరసత్వ సవరణ చట్టం(CAA)చట్టాన్ని ప్రతిపక్షాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో.. బీజేపీ సర్కార్ దాన్ని అంతగా సమర్థిస్తోంది. సీఏఏ అనేది ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన చట్టం అని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా.. ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని బీజేపీ చెబుతోంది. అంతేకాదు, ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఎన్ని నిరసనలు చేసినా.. సీఏఏ చట్టాన్ని అమలుచేసి తీరుతామని తేల్చి చెబుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా మిగతా పార్టీలన్ని కలిసొచ్చినా సరే.. సీఏఏ అమలుపై ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గేది లేదని తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. 1950లో జరిగిన నెహ్రూ-లియాఖత్ ఒప్పందాన్ని చేస్తామని హామీ ఇచ్చారు. సీఏఏ అమలుపై ప్రజలను చైతన్యం చేసేందుకు రాజస్తాన్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. నెహ్రూ-లియాఖత్ ఒప్పందం గురించి అమిత్ షా ప్రస్తావించిన నేపథ్యంలో.. అసలు ఈ ఒప్పందమేంటి..? దాని నేపథ్యమేంటి..? అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

నెహ్రూ-లియాకత్ ఒప్పందం :
భారత తొలి ప్రధాని నెహ్రూ,పాకిస్తాన్ తొలి ప్రధాని లియాకత్‌ల మధ్య ఏప్రిల్ 8,1950లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ఇది. న్యూఢిల్లీ వేదికగా ఆరు రోజుల పాటు జరిగిన చర్చల సారాన్ని ఇందులో పొందుపరిచారు. దీని ప్రకారం ఇరు దేశాల్లోని మైనారిటీలకు మతాలతో సంబంధం లేకుండా సమాన హక్కులు కల్పించాలి. రెండు దేశాల్లోనూ మైనారిటీ కమీషన్లు ఏర్పాటు చేయాలి.

అమిత్ షా ఏమంటున్నారు..?:
నెహ్రూ-లియాకత్ ఒప్పందం ప్రకారం భారత్‌లో మైనారిటీలు హక్కులు రక్షించబడ్డాయి కానీ పాకిస్తాన్‌లో మైనారిటీలపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని అమిత్ షా అంటున్నారు. ఒకరకంగా పాకిస్తాన్‌లో హిందువులు,ఇతర మైనారిటీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించబడుతున్నారని అన్నారు. భారత్‌లో రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,చీఫ్ జస్టిస్,ఈసీ చీఫ్.. ఇలా రాజ్యాంగబద్ద పదవుల్లో మైనారిటీలకు అవకాశం దక్కిందని, మరి పాకిస్తాన్,బంగ్లాదేశ్‌లలో అలా జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు.

అక్కడ మైనారిటీల సంఖ్య తగ్గుతోందా..?
భారత్‌లో మైనారిటీలు గౌరవప్రదంగా బతుకుతుంటే.. పొరుగు దేశాల్లోని మైనారిటీలపై మాత్రం వివక్ష,దాడులు కొనసాగుతున్నాయన్నారు మోదీ. 1947లో పాకిస్తాన్‌లో మైనారిటీల సంఖ్య 23శాతం ఉంటే, 2011 నాటికి అది 3.7శాతానికి పడిపోయిందని ఇటీవల చెప్పారు. బంగ్లాదేశ్‌లో 1947లో మైనారిటీల సంఖ్య 22శాతం ఉండగా.. ఇప్పుడది 7.8శాతానికి పడిపోయిందన్నారు. అదే సమయంలో భారత్‌లో 1951లో 84శాతం హిందువులు ఉంటే, ఇప్పుడది 79శాతానికి పడిపోయిందన్నారు. అదే సమయంలో 1951లో భారత్‌లో ముస్లింల సంఖ్య 9.8శాతం ఉంటే.. ఇప్పుడది 14.23శాతానికి చేరిందన్నారు. పొరుగుదేశాల్లో మెజారిటీ జనాభా పెరిగి మైనారిటీల సంఖ్య తగ్గుతుంటే భారత్‌లో మాత్రం మైనారిటీ జనాభా పెరిగి మెజారిటీ జనాభా తగ్గుతోందని ఈ లెక్కల ద్వారా అమిత్ షా వివరించారు. అయితే అమిత్ షా చెప్పిన ఈ లెక్కలపై భిన్నాభిప్రాయాలు కూడా వినిపించాయి.

సీఏఏని సమర్థించుకోవడానికి ఆ ఒప్పందం.. :
సీఏఏలో హిందువులు,క్రైస్తవులు,పార్శీ,సిక్కు,బౌద్దులకు అవకాశం కల్పించి ముస్లింలను మాత్రం మినహాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరికీ ఎలాంటి
భయాందోళనలు అసవరం లేదని.. నెహ్రూ-లియాకత్ ఒప్పందాన్ని తాము అమలుచేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. తద్వారా మైనారిటీ హక్కులకు భంగం వాటిల్లదని చెబుతున్నారు.సీఏఏ అమలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిందని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆ చట్టాన్ని సమర్థించుకోవడానికి అమిత్ షా నెహ్రూ-లియాకత్ ఒప్పందం గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు.
ఏదేమైనా సీఏఏ అమలు విషయంలో వెనక్కి తగ్గే ప్రస్తావనే లేదని అమిత్ షా తేల్చి చెప్పేశారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా 11మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులంతా ఏకం కావాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖలు రాసిన నేపథ్యంలో హోంమంత్రి నుంచి ఇలాంటి కామెంట్స్ వినిపించడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications