"బిహార్ లో 160 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం"
బిహార్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి మరోసారి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 160 సీట్లతో 2/3 వ వంతు మెజార్టీతో బిహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని తెలిపారు. నితీశ్ కుమార్ నాయకత్వంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నాయని అన్నారు. ఎన్డీయే కూటమితో బిహార్ లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని.. యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని.. మావోయిస్టుల విధ్వంసాన్ని అణచివేశామని స్పష్టం చేశారు.
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి వరుసగా ఐదోసారి ఘనవిజయం సాధించబోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 160 స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 2/3 వ వంతు మెజార్టీతో విజయ దుందుభి మోగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ వార్తా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పరిపక్వత కలిగిన రాష్ట్రాల్లో బిహార్ ఒకటని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉందని.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. నితీశ్ కుమార్ నాయకత్వంలోనే తాము ఎన్నికల బరిలోకి వెళ్తున్నట్లు చెప్పారు. అయితే సీఎం అభ్యర్థి విషయంపై ఎన్నికల తర్వాత డిసైడ్ చేస్తామని వివరించారు.

ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది ఎన్డీయే కూటమి. సంకల్ప్ పత్ర పేరుతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మేనిఫెస్టో ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర యువతకు కోటికి పైగా ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో స్కిల్స్ సెన్సన్ ను నిర్వహిస్తామని ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో పేర్కొంది. అంతేకాక ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. ఇక బిహార్ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబరు 6, 11 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. బిహార్ తోపాటుగా దేశంలో మరో 8 స్థానాల్లో నవంబరు 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలన్నీ నవంబరు 14న విడుదల కానున్నాయి.












Click it and Unblock the Notifications