రేసు నుంచి 'అజిత్' ఔట్: 'శశికళనే వారసురాలు అని జయ చెప్పారు!'
చెన్నై: అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేపట్టాలని ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సహా పలువురు ముఖ్య నేతలు ఇప్పటికే కోరుతున్నారు. తాజాగా, పార్టీలో బలమైన నేతగా పేరొందిన లోకసభ డిప్యూటీ స్పీకర్ తంబీదురై కూడా శశికళకే ఓటు వేశారు.
శశికళకు పార్టీ నడిపే సామర్థ్యం, అనుభవం ఉన్నాయని తంబీదురై చెప్పారు. జయలలితతో కలిసి శశికళ 35 ఏళ్లు గడిపారని, తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారని, రాజకీయ విరోధం కారణంగానే ఆమె పైన నకిలీ కేసులు నమోదు చేశారన్నారు. జైలుకు కూడా వెళ్లారన్నారు.
చాలా ముప్పుల నుంచి జయలలితను శశికళ కాపాడారని చెప్పారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో జయలలితకు సలహాలు, సూచనలు చేసారని చెప్పారు. శశికళ చెప్పినట్లు నడుచుకోవాలని తనకు జయలలిత ఎన్నోసార్లు చెప్పారని తంబీదురై అన్నారు.

జయలలితను కార్యకర్తలు పురుచ్చితలైవి అమ్మ అంటారని, అమ్మతో శశికళ ఉంటారు కాబట్టి ఆమెను చిన్నమ్మ అని పిలిచేవాళ్లమన్నారు. దీని పైన జయలలిత ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. శశికళనే వారసురాలు అని చెప్పడానికి ఇవే నిదర్శనం అన్నారు.
కాగా, అన్నాడీఎంకే వారసుల జాబితాలో అజిత్ పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అజిత్ పేరు వినిపించినా ఆయన జోక్యం మాత్రం లేదు. అదే సమయంలో శశికళ, షీలా బాలకృష్ణన్ తదితరుల పేర్తు వినిపించాయి. పట్టు కోసం తొలుత ఎవరికి వారు ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇప్పుడు మాత్రం ప్రధానంగా శశికళ కనిపిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే అజిత్ లేదా ఎవరు పేరు అమ్మ రాయలేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. శశికళ వారసురాలు అని అమ్మ పరోక్షంగా చెప్పారని అంటున్నారు.
మరోవైపు, అమ్మ మృతి అనంతరం ఇంతలా చర్చ జరుగుతోంది. కానీ అప్పుడు వినిపించిన అజిత్ పేరు ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు. దీంతో రేసులో అజిత్ లేడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల నాటికి అతను నిజంగానే రేసులో ఉంటాడా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications