విమాన సిబ్బందిపై దౌర్జన్యం- వెనక్కి మళ్లిన ఎయిరిండియా ఫ్లైట్
న్యూఢిల్లీ: విమానాల్లో ప్రయాణికుల దురుసు ప్రవర్తనకు అడ్డు అదుపు ఉండట్లేదు. కొద్దిరోజులుగా ఈ దుష్పరిణామాలు సంభవిస్తూనే వస్తోన్నాయి. ఓ మహిళపై తోటి ప్రయాణికుడు మూత్రం పోసిన ఉదంతాన్ని విస్మరించకముందే మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అది కూడా ఎయిరిండియా విమానంలోనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
256 మంది ప్రయాణికులతో ఏఐ 111 విమానం ఈ తెల్లవారు జామున 6:30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఓ ప్రయాణికుడు హంగామా సృష్టించాడు. సిబ్బందితో గొడవకు దిగాడు. వారిపై దాడి చేశాడు. ఎయిర్ హోస్టెస్‌పై భౌతిక దాడికి పాల్పడ్డాడు.

అడ్డుకోవడానికి ప్రయత్నించిన తోటి ప్రయాణికులపైనా అతను దురుసుగా ప్రవర్తించాడు. దీనితో పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఉదయం 10 గంటలకు మళ్లీ ఢిల్లీ విమానాశ్రయానికే తిరిగి వచ్చిందా ఫ్లైట్. దౌర్జన్యానికి పాల్పడిన ప్రయాణికుడిని విమానాశ్రయం భద్రత అధికారులకు అప్పగించారు. పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.
ఈ విషయాన్ని ఎయిరిండియా యాజమాన్యం ధృవీకరించింది. ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని, శారీరక దాడికి దిగాడని వివరించింది. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోన్నందున తక్షణమే విమానాన్ని వెనక్కి మళ్లించాలని పైలెట్లను ఆదేశించినట్లు తెలిపింది. ఆ ప్రయాణికుడిని తమ సిబ్బంది పోలీసులకు అప్పగించారని, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొంది.

ఈ ఘటన వల్ల ఏఐ 111 విమాన సమయంలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విమానం మధ్యాహ్నం తరువాత లండన్‌కు బయలుదేరి వెళ్తుందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిరిండియా మేనేజ్‌మెంట్ పేర్కొంది. ఈ గొడవకు దారి తీసిన కారణాలను వివరిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు ఓ నివేదికను పంపించామని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications