పట్టాలపై గ్యాస్ సిలిండర్- తప్పిన భారీ ప్రమాదం: విద్రోహచర్య?
Indian Railways: ఈ మధ్యకాలంలో వరుసగా రైలు ప్రమాదాలు సంభిస్తోన్నాయి. అదృష్టవశావత్తూ భారీగా ప్రాణనష్టం సంభవించట్లేదు గానీ ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖకు భారీగా ఆస్తినష్టాన్ని కలుగజేస్తోన్నాయి.
ఇటీవలి కాలంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఇదివరకు విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్, కాంచన్‌జుంగ, హౌరా- ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, వారణాశి జంక్షన్- అహ్మదాబాద్ సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదాల బారిన పడ్డాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ప్రమాదమే తప్పింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో తాజా ఘటన సంభవించింది. పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ముందుగానే గుర్తించారు గూడ్స్ రైలు పైలెట్. ఎమర్జెన్సీ బ్రేెక్ వేయడం ద్వారా రైలు అప్పటికప్పుడు ఆపివేశారు. సిలిండర్‌కు అత్యంత సమీపంలో వచ్చి ఆగింది గూడ్స్ రైలు. ఏ మాత్రం ఆలస్యం చేసి వున్నా గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యేదే.
కాన్పూర్- ప్రయాగ్ రాజ్ మార్గంలో ప్రేమ్‌పూర్ స్టేషన్ సమీపంలో ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించారు. సకాంలో అత్యవసర బ్రేకులు వేసి ప్రమాదాన్ని తప్పించగలిగారు. వెంటనే ఈ సమాచారాన్ని సంబందిత అధికారులకు తెలియజేశారు.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే భద్రత సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్దేశపూరకంగానే దీన్ని పట్టాలపై పెట్టి ఉంటారని భావిస్తోన్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు నార్త్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.
గతంలో రాజస్థాన్‌లోని అజ్మీర్, ప్రయాగ్ రాజ్ సమీపంలో ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అజ్మీర్‌లో పట్టాలపై ఉంచిన సిమెంట్ దిమ్మెలను ఢీకొని రైలు ప్రమాదానికి గురైంది. ముందు భాగం దెబ్బతిన్నది. ప్రయాగ్ రాజ్ వద్ద సిలిండర్‌ను గుర్తించారు అధికారులు.












Click it and Unblock the Notifications