బంగాళాఖాతంలో పెను భూకంపం: పోటెత్తిన అలలు..తీరంలో భయాందోళనలు
న్యూఢిల్లీ: బంగాళాఖాతం (Bay of Bengal)లో పెను భూకంపం (Earthquake) సంభవించింది. దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది. స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నారు.
ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:32 నిమిషాలకు బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. అండమాన్ నికోబార్ దీవులకు వాయవ్య దిశగా సుమారు 200 నాటికన్ మైళ్ల దూరంలో 8.55 అక్షాంశం, 90.93 రేఖాంశం వద్ద గల సముద్ర గర్భ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.

సముద్ర గర్భం ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలిక వల్ల భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి నష్టం సంభవించిందనేది ఇంకా తెలియరాలేదు.
దీనివల్ల అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాలు ప్రభావితం అయ్యాయి. తీరంలో అలలు పోటెత్తాయి. అల్లకల్లోలంగా మారాయి. ఇప్పటివరకు సునామీ హెచ్చిరకలు జారీ చేయలేదు గానీ తీర ప్రాంతాల్లో హైఅలర్ట్‌ను ప్రకటించారు అధికారులు. సముద్రంలో ఎవరూ దిగకుండా చర్యలు తీసుకున్నారు. అలల తీవ్రత తగ్గేంత వరకూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు.
కొద్దిరోజులుగా వరుస భూకంపాలు వణికిస్తోన్న విషయం తెలిసిందే. నేపాల్ మొదలుకుని, బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్‌ను వణికిస్తూ వస్తోన్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో సంభవించిన భూకంపం వల్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. రోడ్లపై జాగారం చేశారు. నేపాల్‌లో సంభవించిన భూకంపంలో 148 మంది దుర్మరణం పాలయ్యారు.












Click it and Unblock the Notifications