రాజ్ భవన్ లో బాంబు పెట్టాము, ఆలస్యం చేస్తే మీకే నష్టం, కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి !
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ఉత్తుత్తి బాంబు బెదిరింపు ఫోన్లు ఎక్కువ అయ్యాయి. పనిపాట లేని కొందరు నిందితులు అనసరంగా ఫోన్లు చేసి పోలీసులకు, ప్రజలకు, అధికారులకు నిద్రలేకుండా చేస్తున్నారు. మరోసారి పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన నిందితులు రాజ్ భవన్ లో బాంబు పెట్టాము, కొద్ది సేపటిలో ఆ బాంబు పేలిపోతుంది అంటూ ఫోన్ కట్ చెయ్యడం కలకలం రేపింది.
బెంగళూరులోని కర్ణాటక రాజ్‌భవన్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు ఫోన్ కాల్ చేయడంతో ఆ ప్రదేశంలో ఆందోళన వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బెంగళూరు సిటీ పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో బాంబు పెట్టినట్లు ఆ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపు కాల్ చేసినట్లు సమాచారం.

ఫోన్ కాల్ రిసీవ్ చేసిన వెంటనే బెంగళూరు సిటీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు వెంటనే రాజ్‌భవన్‌కు పరుగు తీసి అక్కడ తనిఖీలు చేపట్టారు. రాజ్ భవన్ లోని సిబ్బందిని బయటకు పంపించి రాజ్ భవన్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. రాజ్ భవన్ కు సమీపంలోనే విధాన సౌధ, కర్ణాటక హైకోర్టు కూడా ఉండటంతో పోలీసులు, బాంబు నిర్వీర్య దళం సిబ్బంది అణువనువునా పరిశీలించారు.
అయితే రాజ్ భవన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి బాంబు చిక్కకపోవడంతో పొలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో బెంగళూరులోని విధాన సౌధ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అర్దరాత్రి ఉత్తుత్తి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసి నిద్రలేకుండా చేసిన కేటుగాడు ఎవరు అని బెంగళూరు సిటీ పోలీసులు ఆరా తీశారు.

బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ ను పోలీసులు ప్రస్తుతం ట్రాక్ చేస్తున్నారు. బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కనిపించడం లేదని, అతని కోసం గాలిస్తున్నామని బెంగళూరు సిటీ పోలీసు అధికారులు తెలిపారు. ఇటీవల బెంగళూరులోని దాదాపు 48 పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెంగళూరు నగరంలోని ప్రైవేట్ పాఠశాలల్లో బాంబులు అమర్చినట్లు ఈ-మెయిల్ రావడంతో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, స్కూల్ యాజమాన్యంతో ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది.
స్కూల్స్ కు బాంబు బెదిరింపులు రావడంతో దీనిపై పోలీసులు విచారించగా ఫేక్ బాంబు బెదిరింపు అని తేలింది. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్, యలహంక పోలీస్ స్టేషన్ పరిదిలోని 15 ప్రైవేట్ పాఠశాలలు, అనేకల్‌లోని 5 పాఠశాలలు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసం ఉంటున్న సదాశివనగర్ లోని ఆయన ఇంటి పక్కనే ఉన్న పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో బెంగళూరులోని కర్ణాటకలోని రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications