ఢిల్లీలో అన్నామలై ప్రత్యక్షం
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం అక్కడి రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమిలో లుకలుకలు తలెత్తినట్టు కనిపిస్తోన్నాయి. ఇప్పటికే ఏఐఏడీఎంకేలోని ఒక వర్గం టీవీకేకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తోంది. ఫ్లోర్ టెస్ట్ లోనూ ఆ పార్టీకే ఓటువేశారు ఆ వర్గానికి చెందిన శాసనసభ్యులు.
ఈ పరిణామాలు ఇప్పుడు బీజేపీకీ పాకాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. తమిళనాడు బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై సొంతంగా వేరుకుంపటి పెట్టబోతోన్నారనే ప్రచారం జరుగుతోండటమే దీనికి నిదర్శనం. ఆయనకు మద్దతుగా రాష్ట్రంలో పలుచోట్ల పోస్టర్లు, బ్యానర్లు సైతం వెలిశాయి. ప్రత్యేకించి దక్షిణ తమిళనాడు జిల్లాల్లో వీటి తీవ్రత అధికంగా ఉంది. బీజేపీ నుంచి బయటికి వచ్చి, విజయ్ తరహాలో కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ పరిణామాల మధ్య అన్నామలై దేశ రాజధానిలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఉదయం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిశారు. తన రాజకీయ భవిష్యత్తు, కొత్త పార్టీ ఏర్పాటుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటు కావడం చర్చనీయాంశమైంది. సుమారు 40 నిమిషాల పాటు నితిన్ నబీన్ తో సమావేశం అయ్యారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తోనూ భేటీ అయ్యారు.
సమావేశం ముగిసిన అనంతరం బయటికి వచ్చిన అన్నామలై విలేకరులతో క్లుప్తంగా మాట్లాడారు. నూతన పార్టీ ఏర్పాటు గురించి ప్రశ్నించగా ఆయన దాటవేశారు. దీనికి అవునని కానీ, కాదని గానీ సమాధానం ఇవ్వలేదు. ఓ రెండు రోజులు వేచి ఉండాలని, అన్ని విషయాలు మాట్లాడుకుందామని అన్నారు. అదే సమయంలో నితిన్ నబీన్, బీఎల్ సంతోష్ తో జరిగిన సమావేశ వివరాలను వెల్లడించడానికీ ఆయన నిరాకరించారు.
అన్నామలై పార్టీలోనే కొనసాగడానికి బీజేపీ కేంద్ర నాయకత్వ చేసిన ప్రతిపాదనలన్నింటినీ తిరస్కరించినట్లు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు, రాజ్యసభ సీటుతో సహా ఏ పదవిని స్వీకరించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. టీవీకే వంటి ఏ ఇతర పార్టీలోనూ చేరబోనని అధిష్ఠానం ముందు స్పష్టం చేశారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పరిణామాలు, ద్రావిడ రాజకీయ సంప్రదాయానికి వ్యతిరేకం కాదని బీజేపీ తమను తాము ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నాలే అన్నామలై దూరం జరగడానికి కారణం అయ్యాయనే అభిప్రాయాలు ఉన్నాయి.
మూడు భాషల విధానంపైనా గతంలో అన్నామలై బీజేపీతో విభేదించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేతో అన్నామలై సంబంధాలు దెబ్బతిన్నాయి. జయలలితలపై సీఎన్ అన్నాదురై చేసిన వ్యాఖ్యలు దీన్ని తీవ్రతరం చేశాయి. ఏఐఏడీఎంకే పట్టుబట్టడంతోనే ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించారని ప్రచారం ఉంది.
మరోవంక.. అన్నామలై అభిమాన సంఘాలు ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేపట్టాయి. అన్నామలై అన్బు కూట్టం పేరుతో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రామన్ని ప్రారంభించింది కూడా. ఈ సంఘటనలు అన్నామలై నూతన రాజకీయ ప్రస్థానానికి సంకేతాలుగా భావిస్తున్నారు. ఈ పరిణామంపై ఆయన బహిరంగంగా స్పందించకపోయినా, తమిళ రాజకీయాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications