Velankanni: మేరీ మాత ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు: ప్రత్యేక రైళ్లు
చెన్నై: తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో వెలిసిన ప్రఖ్యాత వేళాంకణి మేరీ మాత ఉత్సవాలు ఘనంగా ఆరంభం అయ్యాయి. 11 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ సాయంత్రం ధ్వజావరోహణంతో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. ఆరోగ్యమాతను దర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వేళాంకణికి చేరుకుంటోన్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సదరన్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. సికింద్రాబాద్, బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే, నైరుతి రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ప్రధాన నగరాల నుంచి వేళాంకణికి ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

ఈ సాయంత్రం 5:45 నిమిషాలకు తంజావూరు డియోసెసన్ బిషప్ దేవదాస్ ఆంబ్రోస్, డయాసిస్ పరిపాలకర్ సహాయరాజ్, అసిస్టెంట్ బిషప్ డేవిడ్ తంగరాజ్ ధ్వజావరోహణం చేశారు. మేరీ మాత జెండాను ప్రతిష్ఠించారు. అనంతరం ఊరేగింపును నిర్వహించారు. ఆలయ ఆడిటోరియంలో మేరీ మాత ఉత్సవాలను జరిపారు. అన్న సమారాధాన చేపట్టారు.
వేళాంకణి వార్షిక ఉత్సవాల కోసం తమిళనాడు నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచీ భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా తొలి రోజు నాడే 50 వేల మందికి పైగా భక్తులు మేరీ మాతను దర్శించారు. ఈ 11 రోజుల వ్యవధిలో సుమారు 20 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా చర్చి కమిటీ ఏర్పాట్లు చేసింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లును చేసింది ప్రభుత్వం. 2,500 మంది అదనపు పోలీసులను మోహరింపజేసింది. 27 హై అబ్జర్వేషన్ టవర్లు, 4 డ్రోన్ కెమెరాలు, 760 నిఘా కెమెరాలు పోలీసులు అమర్చారు. భక్తుల రద్దీతో వేలంకణిలోని హోటళ్లు, లాడ్జీలు, బస్టాండ్, హోటళ్లు, దుకాణాలు కిక్కిరిసిపోయాయి.












Click it and Unblock the Notifications