అనూహ్య కేసు: ఉత్తి చేతులతో వెళ్లిన మహా పోలీసులు!
ముంబై/విజయవాడ: ఇటీవల మహారాష్ట్రలోని ముంబైలో దారుణ హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంకు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య కేసులో కర్ల్ ప్రభుత్వ రైల్వో పోలీసులు విచారణ కోసం ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చారు. అయితే, వారు ఉత్తి చేతులతోనే తిరిగి మహారాష్ట్రకు వెళ్లారు!
ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ విశ్రాంతి గదిలో అనూహ్య ఓ వ్యక్తితో కలిసి ఉన్నట్లుగా సిసిటివి ఫుటేజిలో పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్ల్ రైల్వే పోలీసులు ఈ ఫుటేజీని అనూహ్య కుటుంబ సభ్యులకు చూపించి అతను ఎవరో గుర్తించాల్సిందిగా కోరారు. సిసిటివి ఫుటేజీలో ఉన్న వ్యక్తిను కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు.
అనూహ్య పక్కనున్న ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని ఆమె అంకుల్ చెప్పారు. కుటుంబ సభ్యులు కూడా అదే చెబుతున్నారు. పక్కనున్న వ్యక్తితోనే అనూహ్య వెళ్లిందని పోలీసులు ఎలా చెప్పగలరని, ఇది చాలా రద్దీ ప్రాంతమని, కాబట్టి ఎవరో పక్కన ఉండవచ్చునని అంటున్నారు. పక్కన నిలబడిన వ్యక్తి గురించి తమకు ఏమాత్రం తెలియదని చెప్పారు. దీంతో సిసిటివి ఫుటేజీలో కనిపిస్తున్న వ్యక్తి గురించి కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి సమాచారం లేకుండానే పోలీసులు తిరుగు పయనమయ్యారు.
సిసిటివి ఫుటేజీలో అనూహ్య మాట్లాడుతున్న ఫోన్ ఎవరిదో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఆమె సొంత ఫోనా లేక మరొకరిదా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
మరోవైపు సిసిటివి ఫుటేజీలో ఉన్న ముఖాలను పోలి ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాదులో అనూహ్యకు టిఫిన్ బాక్సు ఇచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించి దాదాపు రెండు రోజుల పాటు విచారించారు.












Click it and Unblock the Notifications