అనూహ్య హత్య కేసు: నమ్మించి మోసం చేశాడు
ముంబై: ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్యను నిందితుడు నమ్మించి మోసం చేశాడు. అనూహ్య హత్య కేసు వివరాలను ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. జనవరి 4వ తేదీన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన అనూహ్య 5వ తేదీన ముంబై రైలు దిగి అదృశ్యమై, ఆ తర్వాత హత్యకు గురైనట్లు తేలిన విషయం తెలిసిందే.
అనూహ్య హత్య కేసులో నాసిక్‌కు చెందిన చంద్రభాన్ సాసప్‌ను పోలీసులు అరెస్టు చేసి ముంబైలోని ఖిల్లా కోర్టులో హాజరు పరిచారు. ఈ నెల 15వ తేదీ వరకు నిందితుడికి పోలీసు కష్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
పోలీసు కమిషనర్ రాకేష్ మారియా చెప్పిన వివరాలు ప్రకారం - చంద్రభాన్ ఓ రైల్వే కూలీ కుమారుడు. తండ్రి మరణం తర్వాత అతని లైసెన్సును తన పేరు మీదికి మార్చుకుని కొంత కాలం రైల్వే కూలీగా పనిచేశాడు. ఆ తర్వాత కాల్ సెంటర్లకు కొంత కాలం క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం అతను మూడో భార్యతో నాసిక్‌లోని నివాసం ఉంటున్నాడు. అక్కడే అతను ట్రాన్స్‌పోర్ట్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

చంద్రభాన్‌కు రైల్వే స్టేషన్లలో బ్యాగులు, సెల్‌ఫోన్లు దొంగిలించే అలవాటు ఉంది. అమ్మాయిలను కూడా వేధిస్తూ ఉండేవాడు. అతనిపై ముంబై, మన్మాడ్ పోలీసు స్టేషన్లలో పలు కేసులున్నాయి. జనవరి 5వ తేదీన ఉదయం మిత్రులతో కలిసి ముంబై రైల్వే స్టేషన్‌కు వ్చచాడు. అనూహ్యను చూసి 300 రూపాయలు ఇస్తే ఇంటి వద్ద దింపుతానని ఆమెకు చెప్పాడు.
ఆమె బయటకు వచ్చాక చూస్తే అతను బైక్ తీసుకుని వచ్చాడు. దాంతో ఆమె ముందు కాస్తా వెనకాడింది. కానీ ఆమెకు అతను నచ్చజెప్పాడు. తన బైక్ నెంబర్, సెల్ నెంబర్ నోట్ చేసుకోవాలని చెప్పాడు. దాంతో ఆమె అతన్ని నమ్మేసింది. ఆమెను తిలక్ నగర్ వైపు తీసుకు వెళ్లాడు. నిర్మానుష్యమైన ప్రదేశానికి వచ్చిన తర్వాత పెట్రోల్ అయిపోయిందని బైక్ ఆపేశాడు. బైక్‌ను ఆపి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించిదంి. దాంతో ఆమెను అతను హత్య చేశాడు.
అనూహ్య హత్య కేసును ఛేదించడానికి 9 బృందాలు పనిచేశాయి. విచారణ బృందాలు 36 సిసి కెమెరాల్లోని సిసిటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. నిందితుడిని పట్టుకోవడానికి 2500 మందిని విచారించారు.












Click it and Unblock the Notifications