Weather update: ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు, వారికి హెచ్చరిక
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉండగా.. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ ఆది, సోమవారాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.తెలంగాణలో పలు జిల్లాలలో ఆది, సోమవారాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎల్లో హెచ్చరిక కూడా జారీచేశారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం, ఇప్పటికే ఎల్లో హెచ్చరిక జారీ చేయడంతో.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. భారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే డెంగ్యూ, మలేరియా వ్యాధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీలోనూ కొనసాగుతున్న భారీ వానలు, మత్స్యకారులకు హెచ్చరిక
ఇక ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని మత్స్యకారులు బుధవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే భారీగా కురిసిన వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి.
వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాల, పట్టణాల్లో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకు హైదరాబాద్ తోపాటు వరంగల్, సిరిసిల్ల ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే.

దేశ రాజధానిలోనూ భారీ వర్షాలు
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం మరోసారి ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్, రాజస్థాన్ లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఢిల్లీలో సెప్టెంబర్ 18వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
121 ఏళ్ల తరువాత ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది. 1975 తరువాత ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. గడిచిన నాలుగు నెలలల్లో 113.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఈ వర్షాకాలంలో కురవాల్సిన 60 శాతం వర్షపాతం 7 రోజుల్లోనే నమోదు కావడం గమనార్హం.
శనివారం కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ నగరంతోపాటు విమానాశ్రయం కూడా జలమయమైన విషయం తెలిసిందే. రోడ్లపై మోకళ్లలోతు వరకు నీరు నిలిచపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.












Click it and Unblock the Notifications