మరో అల్పపీడనం: ఏపీలో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు, 40-50 కి.మీ వేగంతో గాలులు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చెరువులు నిండు కుండలాను తలపిస్తుండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీటితో నదులు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. ఏపీ కంటే తెలంగాణలోనే భారీ వర్షాలు కురవగా, రానున్న రోజుల్లో ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
Recommended Video
జులై 28న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

ఈ ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశ వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులుతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడన ప్రభావంతో తీరం వెంట 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
దక్షిణ కోస్తాంధ్రలో కూడా మంగళ, బుధవారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి క్రమంలో భారీ వర్షాలతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత, కరోనా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications